Site icon HashtagU Telugu

Rythu Bandhu: ‘రైతు బంధు’ కాకిలెక్కలు ఇలా!

Kcr Rythu

Kcr Rythu

తెలంగాణ రైతు బంధు ఖాతాలో పడుతున్న డబ్బుకు వెబ్ సైట్ లో పొందుపరిస్తున్న వివరాలకు వ్యత్యాసం ఉంది. దీంతో రైతులు అయోమయంలో పడుతున్నారు. ఈనెల 13వ తేదీ వరకు 4,53,421 మంది రైతుల కు రూ.508,93,60,000 జమ అయినట్టు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదైంది. కాగా, 14వ తేదీ సాయంత్రం వరకు 4,53,399 మంది రైతులకు రూ.508,89,97,000జమ అయినట్లు గా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అయితే, ఒకరోజుకు ముందుగా రైతుల సంఖ్య, జమ అయిన డబ్బు మొత్తాన్ని అధికంగా చూపి, ఆ తరువాత రోజు సంఖ్యను తగ్గించారు. దీంతో ఇవి అసలు లెక్కలా? కాకి లెక్కలా? నిజంగానే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందో లేదా అనే అనుమానాలు కోకొల్లలు. వెబ్‌సైట్‌లో తప్పుల తడకగా లెక్కలు చూపిస్తున్న యంత్రాం గం, వాస్తవ పరిస్థితులను చూపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్రెజరీ నుంచి డబ్బులు జమ సమయంలో ఖాతా నెంబర్లు సక్రమంగా లేకపోవడంతో కొందరివి వెనక్కి వచ్చాయని, దీంతోనే సంఖ్య తక్కువగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు పథకంలో భా గంగా ఇప్పటి వరకు రూ.508.89కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఎనిమిదో విడతగా 2021, డిసెంబరు 28వ తేదీ నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో నగదును జమచేస్తోంది. ఇప్పటి వరకు 7.20ఎకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే నగదు జమచేసింది. సంక్రాంతి పండుగ వరకు పూర్తిస్థాయిలో రైతుబంధు సొమ్ము వస్తుందని రైతులు ఆశించినా అమలుకాలేదు.

రైతుబంధుకు అర్హులైన 4,93,146 మంది రైతులను గుర్తించి వివరాలను రాష్ట్ర వ్యవసాయశాఖకు జిల్లా అధికారులు పంపిచారు. వీరికి సంబంధించి రూ.616,21,46,323 రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కాగా, రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు ఇప్పటి వరకు 4,69,733 మందివి మాత్రమే అప్‌డేట్‌ అయ్యాయి. ఇందులో 4,68,696 మంది వివరాల వెరిఫికేషన్‌ పూర్తయింది. మొత్తంగా 4,66,772 మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ట్రెజరీకి వివరాలు పంపింది.

అందుకు రూ.571,78,32,840 జమ చేయాల్సి ఉంది. కానీ, 4,53,399 మంది రైతుల ఖాతాల్లో రూ.508,89,97,404 జమయ్యాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఇంకా 13,373 మంది రైతులకు రైతుబంధు సాయం అందాల్సి ఉంది. అయితే రైతులకు ఎంత భూమి ఉంటే అంతే వేస్తారా లేక కోత పెడతారా, భూమి ఎక్కువ ఉన్న రైతులకు పథకాన్ని వర్తింపజేస్తారా లేక నిలిపివేస్తారా అనే అనుమానం ఉంది. ఇప్పటి వరకు 7.20ఎకరాల భూమి ఉన్న రైతుల వరకే ఈసారి రైతుబంధు అందింది. ప్రభుత్వ సాయం నిలుస్తుందనే అనుమానాలు 10 నుంచి 20 ఎకరాల లోపు ఉన్న రైతుల్లో ఉంది. గతంలో ఎపుడూ లేని విధంగా ఈ సారి రైతులు ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version