Minister Jupally: దేశంలో రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా మహారాష్ట్రలోనే జరుగుతున్నా మహాయుతి కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సోయాబీన్, పత్తి రైతులకు సరైన ధర కల్పించేందుకు కృషి చేస్తుందని తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి (Minister Jupally) కృష్ణారావు అన్నారు. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు బీజేపీ పుణ్యమేనని ఆయన ఆరోపించారు. ఎంవీఏ కూటమి అధికారంలోకి రాగానే తెలంగాణ తరహాలో గ్యారంటీలను మహారాష్ట్రలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయిగాం నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. మీనల్ నిరంజన్ పాటిల్ తరపున మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. మహా వికాస్ అఘాడీ అధికారంలోకి రాగానే తెలంగాణ తరహాలో గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో మీనల్ ను గెలిపించాలని కోరారు. అదీవాసీలు, దళితులు, పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.
Also Read: Rajoana mercy plea : బల్వంత్ సింగ్‌కు క్షమాభిక్ష..రాష్ట్రపతి నిర్ణయాన్ని కోరిన సుప్రీంకోర్టు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కూటమి అవలంబిస్తున్న విధానాల వల్ల దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే రైతులు ఆత్యహత్యలు చేసుకుంటున్నారని, నీటి కొరత, పంటలకు కనీస మద్దతు ధరలు లేకపోవడం, ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నిలబెట్టుకుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే రైతుల సంక్షేమం దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆయన ఓటర్లకు వివరించారు.