Site icon HashtagU Telugu

Farmer’s Death: కొనుగోలు కేంద్రాల్లో ఆగిపోతున్న రైతుల గుండెలకు ఆక్సిజన్ అందించలేమా?

farmer's death

farmer's death

అన్ని ప్రభుత్వాలు రైతు సంక్షేమమే కోరుకుంటాయి. కానీ అన్ని ప్రభుత్వాల హయాంలోనూ రైతుల చావులు కొనసాగుతూనే ఉంటాయి. పంట వేయడానికి మొదటిరోజు పొలంలోకి అడుగుపెట్టిన రోజునుండి పండించిన పంట అమ్మి డబ్బులు చేతికొచ్చే లోపు ఏ ఇబ్బంది ఎటువైపునుండి వచ్చినా రైతన్ననే బలవుతున్నాడు. రెండురోజుల కింద సిద్ధిపేట జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రాములు అనే రైతు గుండెపోటుతో మరణించాడు. ఆ విషయం మరిచిపోకముందే కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో మరో రైతు గుండె ఆగిపోయింది.

ఆబాది జమ్మికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని సంచుల్లో నింపుతుండగా బిట్ల ఐలయ్య అనే రైతుకు గుండెపోటవచ్చి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రభుత్వం అలసత్వం వల్లే ఐలయ్య చనిపోయాడని తమని ప్రభుత్వం ఆదుకోవాలని అతని కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు.

బిట్ల ఐలయ్య 15 రోజుల క్రితం కరీంనగర్ జిల్లా ఆబాది జమ్మికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వరి తీసుకెళ్లారు. వరిలో తేమ శాతం ఎక్కువగా ఉందని, ఆ వడ్లను కొనడానికి అక్కడి సిబ్బంది నిరాకరించారు. దీంతో ఐలయ్య ప్రతి రోజూ ఐకేపీ కేంద్రానికి వెళ్లి తన వడ్లు ఆరబోసుకుని వస్తున్నాడు.
రోజూలాగే ఆరబోసిన ధాన్యాన్ని సంచుల్లో నింపుతుండగా గుండె పొటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కేవలం 20 గుంటల భూమి సాగు చేస్తున్న ఐలయ్య తన ధాన్యాన్ని అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బంది పడి మానసికంగా ఆందోళన చెంది గుండెపోటుతో మరణించాడని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు.

నిన్న సిద్ధిపేట అయినా, ఈరోజు కరీంనగర్ అయినా, రాములు అయినా, ఐలయ్య అయినా ఇవన్నీ నామవాచకాలు కాదు సర్వనామాలే. ఇలాంటి సిద్దిపేటలు, కరీంనగర్ల లాంటి ఎన్నో కొనుగోలు కేంద్రాల్లో, రామయ్య, ఐలయ్య లాంటి రైతులెందరో గుండెపోటుతో మరణించాల్సిందేనా? మనమందరం కలిసి ఆక్సిజన్ అందక ఆగిపోతున్న వాళ్ళ గుండెలకు ఊపిరి పోయలేమా?