తెలంగాణలో వ్యవసాయానికి కీలకమైన యూరియా (Urea ) సరఫరాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది. గత బీఆర్‌ఎస్ పాలనలో రైతులు కాలర్ ఎగరేసి దర్జాగా పంటలు పండించారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మాత్రం యూరియా కోసం అధికారుల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది సాగు పనులు మొదలై నెల రోజులు గడిచినా, రైతన్నలకు సరిపడా యూరియా లభించకపోవడంతో ఆందోళనలు చేస్తున్నారు. వర్షాలు పడుతున్నా లెక్క చేయకుండా గంటల తరబడి ఎరువుల కోసం క్యూలైన్లలో నిలబడుతున్నారు. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.
Medigadda : మామా అల్లుళ్లు అతి తెలివితేటలతో మేడిగడ్డ , అన్నారం బ్యారేజిలను నిర్మించారు – సీఎం రేవంత్
ఈ పరిస్థితికి నిదర్శనంగా ములుగు జిల్లాలో చోటు చేసుకున్న ఒక హృదయవిదారక ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రంలో యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులను కలెక్టర్ టీ.ఎస్. దివాకర కలవడానికి వచ్చారు. ఆయన రైతులకు నచ్చజెప్తున్న క్రమంలో, ఓ రైతు తమ కష్టాలు చెప్పి, యూరియా అందించాలని కోరుతూ కలెక్టర్ కాళ్లు పట్టుకోవడం అందరినీ కలిచివేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన రైతుల దీన పరిస్థితిని, యూరియా కొరత ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేసింది. అధికారులను వేడుకునే స్థితికి రైతులు చేరడం ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది.
ఈ సంఘటన నేపథ్యంలో ములుగు కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. అందరికీ అవసరమైన యూరియా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ హామీతో రైతులు తాత్కాలికంగా శాంతించారు. ఈ ఘటన రైతుల పట్ల ప్రభుత్వం మరింత జవాబుదారీగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. యూరియా సరఫరాలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్ది, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. లేకపోతే ఈ సమస్య రాజకీయంగా ప్రభుత్వానికి మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.