Site icon HashtagU Telugu

CM Revanth Reddy : హెచ్‌సీయూ భూములపై ‘ఏఐ’తో దుష్ప్రచారం.. సీఎం సీరియస్

Cm Revanth Reddy Hyderabad Central University Lands Issue

CM Revanth Reddy : ఇటీవలే వివాదాస్పదంగా మారిన  హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూములతో ముడిపడిన కేసులపై సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ (శనివారం)  సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సర్వే నంబరు 25లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదం ఏర్పడిందనే దానిపై సమావేశంలో చర్చ జరిగింది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) ఫొటోలు, వీడియోల వల్ల రాచుకున్న వివాదం ప్రజాస్వామిక వ్యవస్థలకే పెను సవాలుగా మారిందని ఈసందర్భంగా సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘కంచ గచ్చిబౌలి భూముల్లోని చెట్లను నరికివేయడంతో అక్కడి వన్యప్రాణులు చెల్లాచెదురు అయ్యాయంటూ కొందరు ఏఐ వీడియోలను సృష్టించడం దారుణం. దీన్ని మా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. దీనిపై విచారణకు ఆదేశించేలా కోర్టును కోరుతాం’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఏఐ ఫేక్ కంటెంట్‌ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ టూల్స్‌ను సమకూర్చుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి(CM Revanth Reddy)  సూచించారు.

Also Read :Etela Rajender : దూకుడుపై ఈటల.. బీజేపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందా ?

ఫేక్ ఫొటోలు, వీడియోలతో ప్రముఖుల తప్పుడు ప్రచారం

ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా ఠండన్ లాంటి వాళ్లంతా ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోలను పోస్టు చేసి సమాజానికి తప్పుడు సందేశాన్ని చేరవేశారని సమావేశంలో ప్రస్తావన వచ్చింది. ఈ భూముల అంశంపై తొలుత ఫేక్ వీడియోను పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ ఝా కొద్ది సేపట్లోనే తన పోస్టును తొలిగించి క్షమాపణలు చెప్పారని, కానీ మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియోతో ప్రచారాన్ని కంటిన్యూ చేశారని  సీఎంకు అధికారులు తెలిపారు.

Also Read :Chinas No 2 Missing : చైనాలో నంబర్ 2 మాయం.. జిన్‌పింగ్‌‌ సన్నిహితుడికి ఏమైంది ?

నెమళ్లు ఏడ్చినట్లుగా.. జింకలు గాయపడినట్లుగా కంటెంట్.. 

‘‘కంచ గచ్చిబౌలి భూముల్లో గత 25ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులను నిర్మించారు. ఐఎస్‌బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డింగ్‌లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ బిల్డింగ్‌లను నిర్మించారు. వాటిపై ఎన్నడూ వన్యప్రాణులు, పర్యావరణానికి సంబంధించిన వివాదాలు రాలేదు’’ అని సీఎం రేవంత్‌కు అధికారులు గుర్తు చేశారు. ‘‘కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించిన వాస్తవాలను వెల్లడించేలోగా అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి. ఆ అంశమే రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్లోజర్ల వల్ల జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలను తయారు చేశారు’’ అని సీఎంకు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.ఇదే తీరుగా భారత్-పాక్ సరిహద్దుల్లాంటి సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్‌ను క్రియేట్ చేసి వైరల్ చేస్తే భవిష్యత్తుల్లో యుద్ధాలు జరిగే ముప్పు ఉంటుందనే ఆందోళన ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఏఐతో తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫొటోలు కరోనా వైరస్‌ను మించిన మహమ్మారి లాంటివన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ జితేందర్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.