Site icon HashtagU Telugu

Heavy Rains in Telangana : ఆగస్ట్ 14 నుండి 17 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు..జర భద్రం

Telangana Heavy Rains

Telangana Heavy Rains

ఆగస్ట్ 14 నుండి 17 వరకు తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది. ఈసారి దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. అందువల్ల ఈ నాలుగు రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇచ్చే సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ నగరవాసులకు కూడా ఈ నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆగస్ట్ 14 నుండి 17 వరకు ఈ నాలుగు రోజులలో ఒకటి లేదా రెండు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల ప్రభావం హైదరాబాద్ నగరంపై ఎలా ఉంటుందో ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ప్రజలందరూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లవద్దని, జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Rajamouli Sentiment : రాజమౌళి విజయాల వెనుక ఆ ‘లాకెట్’ సెంటిమెంటేనా ..?

ఇక ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని వల్ల వేడుకలకు అంతరాయం కలగవచ్చు. ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారిక వేడుకలలో పాల్గొనేవారు వర్షాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

ప్రస్తుతం కూడా తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, జగిత్యాల, ములుగు, ఖమ్మం వంటి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు రెండు గంటలుగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికే వాతావరణ కేంద్రం 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాయంత్రానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల ప్రజలందరూ రాబోయే రోజుల్లో వర్షాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.