Car Handling Charges : వాహన షోరూంలలో హ్యాండ్లింగ్‌ ఛార్జీల పేరిట దోపిడీ.. ఎలా అంటే ?

వాహనాలు కొనేవారి నుంచి హ్యాండ్లింగ్‌ ఛార్జీలను(Car Handling Charges) వసూలు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Car Handling Charges Car Showrooms Extortion

Car Handling Charges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పలు వాహన షోరూంలలో హ్యాండ్లింగ్‌ ఛార్జీల పేరుతో దోపిడీ జరుగుతోంది. హ్యాండ్లింగ్‌ ఛార్జీగా ఒక్కో బైక్/స్కూటర్‌పై రూ.1000 దాకా, కారుపై రూ. 10వేల దాకా  వసూలు చేస్తున్నారు. కొన్ని కార్ల షోరూంలలో  హ్యాండ్లింగ్‌ ఛార్జీలను రూ.30 వేల వరకు తీసుకుంటున్నారట. దీంతో కొత్తగా వాహనాలు కొనేవారిపై పెనుభారం పడుతోంది. ఈవిధంగా అదనంగా వసూలు చేస్తున్న డబ్బులు ఆయా షోరూంల డీలర్ల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. అయితే  వాహనానికి సంబంధించిన కొటేషన్లు, ఇన్‌వాయిస్‌‌లలో ‘హ్యాండ్లింగ్‌’ అనే పదాన్ని ఎక్కడా రాయడం లేదు.  ఇక బైక్/స్కూటర్ షోరూంలు హ్యాండ్లింగ్‌ ఛార్జీలను తాము ఇచ్చే బిల్లుల్లోని  లైఫ్‌ (రోడ్‌) ట్యాక్స్‌లో కలిపి చూపిస్తున్నారు. వాహనాలు కొనేవారి నుంచి హ్యాండ్లింగ్‌ ఛార్జీలను(Car Handling Charges) వసూలు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయినా వాటిని వాహన షోరూంలు బేఖాతరు చేస్తున్నాయి.

Also Read :Tips For Men : పురుషులు.. మీరు అందంగా కనిపించాలంటే ఇలా చేయండి..!

కంప్లయింట్ చేయడం ఇలా..

వాహనాల్ని స్టాక్‌ యార్డుకు తీసుకురావడం, క్లీనింగ్ చేయడం, షోరూంకు తరలించడం వంటి పనులకు అయిన ఖర్చులను హ్యాండ్లింగ్‌ ఛార్జీలుగా వసూలు చేస్తున్నారు. వాస్తవానికి వాహనం ఎక్స్‌ షోరూం ధరలోనే ఆ వాహనం రవాణా, గోదాం ఛార్జీలు కలిసి ఉంటాయి. ఇంకా అదనంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదని రూల్స్ చెబుతున్నాయి. దీనిపై వాహనం కొనేవారు ఎవరైనా ప్రశ్నిస్తే.. వాహనం మీకు అమ్మలేమని పలు షోరూంల డీలర్లు తెగేసి చెబుతున్నారట. వాస్తవానికి వాహనం కొనేటప్పుడు ఎక్స్‌ షోరూం ధర, లైఫ్‌ ట్యాక్స్, టెంపరరీ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను మాత్రమే తీసుకోవాలి. ఏదైనా షోరూంలో హ్యాండ్లింగ్‌ ఛార్జీలు తీసుకుంటే జిల్లా రవాణాశాఖ అధికారి(డీటీసీ)కి లేదా హైదరాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో లేదా రవాణాశాఖ వెబ్‌సైట్‌లోని మెయిల్‌ఐడీకి కంప్లయింట్ చేయొచ్చు.

Also Read :Mouth Wash: మీరు మౌత్ వాష్ వాడుతున్నారా? క్యాన్సర్ పట్ల జాగ్రత్త వహించండి

బీమా పాలసీలు, లోన్లు.. 

వాహన షోరూంలలో ఇంకా కొన్ని కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి.  వాహన బీమా, వాహన లోన్  కూడా ఆయా షోరూంల నిర్వాహకులు చెప్పిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనం కొనే వ్యక్తి తనకు నచ్చిన కంపెనీ నుంచి బీమా పాలసీ తీసుకోవచ్చని  ఐఆర్‌డీఏ రూల్స్ చెబుతున్నాయి.  వాహన షోరూంల డీలర్లు మాత్రం తమకు  ప్రయోజనం చేకూర్చే బీమా కంపెనీల నుంచి పాలసీలు కొనేలా వాహనదారులను ఒత్తిడికి గురి చేస్తున్నాయి.

  Last Updated: 18 Jan 2025, 09:22 AM IST