Patnam Narender Reddy : లగచర్ల ఘటన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. నరేందర్ రెడ్డి రిమాండ్ బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు పోలీసులు హాజరుపరిచారు. ఆయన రిమాండ్‌ను పొడిగించాలని, మరింత విచారణ చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. పోలీసుల అభ్యర్థన మేరకు పట్నం నరేందర్ రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల అంటే డిసెంబర్ 11 వరకు పట్నం నరేందర్ రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది.
మరోవైపు వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. పట్నం నరేందర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, వికారాబాద్ జిల్లా లగచర్లలో భూ సేకరణపై రైతుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్, అధికారులపై స్థానికులు, గ్రామస్తులు అంతా కలిసి కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేసి కొడంగల్ మెజిస్ట్రేట్ లో హాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు.
Read Also: Credit Card Spending : నెలలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేసిన క్రెడిట్ కార్డ్ యూజర్లు