Site icon HashtagU Telugu

Telangana Elections : కారు..సారూ..ఈసారెన్ని.!

`కారు..సారూ..ప‌ద‌హారు` అంటూ 2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసీఆర్ బోల్తా ప‌డ్డారు. ఆ ఎన్నిక‌ల్లో కేవ‌లం తొమ్మిది మంది ఎంపీల‌ను మాత్ర‌మే గెలుచుకోగ‌లిగారు. ఆ టైంలో కేసీఆర్ హ‌వా న‌డుస్తోంది. రెండోసారి సీఎంగా 2018లో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. యంత్రాంగం ఆయ‌న క‌నుస‌న్న‌న‌ల్లో పనిచేసింది. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశానుసారంగా యంత్రాంగం న‌డిచిన‌ప్ప‌టికీ సీఎంగా ఉన్న కేసీఆర్ కు ప‌రోక్షంగా స‌హ‌కారం అందించారు. ఆ విష‌యాన్ని ప్ర‌త్య‌ర్థులు ప‌లు వేదిక‌ల‌పై ప్ర‌స్తావించారు. అన్ని ర‌కాల హంగులు, అధికార ద‌ర్పం ఉన్న‌ప్ప‌టికీ ఆ ఎన్నిక‌ల్లో గెలిచిన ఎంపీలు కేవ‌లం తొమ్మిదే.

తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ స‌భ స్థానాలు ఉన్నాయి. వాటిలో ఒక‌టి ఎప్పుడూ ఎంఐఎంకు గెలుచుకుంటోంది. మిగిలిన 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుచుకోవాల‌ని `కారు..సారూ..ప‌ద‌హారు` అంటూ స్లోగ‌న్ వినిపించారు. అసెంబ్లీ స్థానాల్లో ఆనాడు గెలిచిన చోట కూడా ఎంపీల‌ను గెలుచుకోలేక‌పోయింది. క‌రీంన‌గ‌ర్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో బీజేపీ గెలుచుకుంది. తెలంగాణ సెంటిమెంట్ తో క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ ప్రాంతాల్లో టీఆర్ఎస్ చాలా బ‌లంగా ఉండి కూడా ఓడిపోయింది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వాకు గులాబీ గిలగిల కొట్టుకుంది. ఇంకో వైపు కాంగ్రెస్ ఆ ఎన్నిక‌ల్లో న‌ల్లొండ‌, భువ‌న‌గిరి, మ‌ల్కాజ్ గిరి లోక్ స‌భ స్థానాల్లో విజ‌యం సాధించింది. ఈసారి కూడా బీజేపీ, కాంగ్రెస్ గ‌తం కంటే బ‌లంగా ఉన్నాయ‌ని స‌ర్వేల సారాంశం.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే, టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోతుంద‌ని స‌ర్వేల చెబుతున్నాయ‌ని ప్ర‌త్య‌ర్థుల అంచ‌నా. అందుకే, ప్ర‌శాంత్ కిషోర్ ను ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా కేసీఆర్ నియ‌మించుకున్నార‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన దుబ్బాక‌, హుజూరాబాద్‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే, బీజేపీ బ‌ల‌ప‌డిన‌ట్టు భావించాల్సి ఉంటుంది. ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శ‌క్తిగా ఎదిగే అవ‌కాశం ఉందని ఆ పార్టీ అంచ‌నా వేస్తోంది. ఉత్త‌ర తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ బల‌ప‌డుతోంది. ఉత్త‌ర భార‌తదేశం నుంచి వ‌చ్చి స్థిర‌ప‌డిన ఓట‌ర్లు హైద‌రాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్ ప్రాంతాల్లో ఎక్కువ‌గా ఉన్నారు. వాళ్లు బీజేపీ వైపు ఎక్కువ‌గా మొగ్గుచూపుతార‌ని ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల ద్వారా స్ప‌ష్టం అవుతోంది.

ఉత్త‌ర తెలంగాణ‌లో బీజేపీ, ద‌క్షిణ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ హ‌వా ఉంటుంద‌ని తాజా స‌ర్వేల సారాంశం. అందుకే, మ‌రోసారి సెంటిమెంట్ ను రెచ్చ‌గొట్ట‌డం ద్వారా ల‌బ్ది పొందాల‌ను కేసీఆర్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలోనే కృష్ణా, గోదావ‌రి నీళ్ల పంప‌కాల వ్య‌వ‌హారాన్ని ట్రాక్ ఎక్కిస్తున్నారు. ఇంత‌కాలం ఏపీ, తెలంగాణ మ‌ధ్య సైలెంట్ గా ఉన్న నీటి వాటా వ్య‌వ‌హారాన్ని పీకే మార్క్ వివాదంగా మార్చేయ‌డానికి వ్యూహం ర‌చిస్తున్నార‌ని వినికిడి. అయితే, గ‌తంలో మాదిరిగా ఈసారి సెంటిమెంట్ రేగితే, సెటిల‌ర్ల ఓట్లు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీకి వెళ్లే అవ‌కాశం లేకపోలేదు. ఫ‌లితంగా టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయే ఛాన్స్ ఉంద‌ని `పీకే` ఈక్వేష‌న్లు వేస్తున్నారు. అందుకే, మ‌తత‌త్త్వం అనే ఒకే ఒక కోణం నుంచి ఈసారి ఎన్నిక‌ల‌ను ఫేస్ చేయాల‌ని టీఆర్ఎస్ భావిస్తోంద‌ట‌.

ప్లీన‌రీలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మ‌త‌, కుల రాజ‌కీయాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు .అంతేకాదు, జాతీయ ఎజెండా కావాల‌ని విభ‌జ‌న వాదాన్ని అట‌కెక్కించారు. తెలంగాణ కోసం విభ‌జ‌న వాదాన్ని ఉవ్వెత్తున లేపిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ వాదం అంటున్నారు. విభ‌జ‌న వాదం కార‌ణంగా అభివృద్ధి కుంటుప‌డింద‌ని చెబుతున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మంలో వినిపించిన వాదానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు ఐక్య‌తారాగాన్ని అందుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉన్న ప్ర‌జా వ్య‌తిరేక‌త‌పై ఎలాంటి చ‌ర్చ జర‌గ‌కుండా మోడీ స‌ర్కార్ వైపు ఓట‌ర్ల దృష్టిని మ‌ర‌ల్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. స‌రిగ్గా ఇలాంటి వ్యూహాన్ని బెంగాల్‌లో పీకే ప్లే చేయ‌డం ద్వారా మ‌మ‌త మూడోసారి సీఎం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనూ అదే వ్యూహం ప‌నిచేస్తుంద‌ని ప్ర‌శాంత్ కిషోర్‌, కేసీఆర్ భావిస్తున్నార‌ని తెలిసింది.

బెంగాల్ రాష్ట్ర లోక్ స‌భ స్థానాల సంఖ్య 42 ఉండ‌గా తెలంగాణ రాష్ట్రంలో కేవ‌లం 17 మాత్ర‌మే ఉన్నాయి. వాటిలో స‌గం స్థానాల్లో కూడా ఈసారి కేసీఆర్ గెలుచుకునే అవ‌కాశం లేద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేసీఆర్ జాతీయ రాజ‌కీయాలను ప్ర‌భావితం చేయ‌డం ఎండ‌మావిగానే చెప్పుకోవ‌చ్చు. పైగా బెంగాల్ రాష్ట్ర ఓట‌ర్ల నాడి, తెలంగాణ ఓట‌ర్ల ఆలోచ‌న‌లు భిన్నంగా ఉంటాయి. రెండు రాష్ట్రాల‌కు ఒకే ఫార్ములా ప‌నిచేస్తుంద‌ని అనుకోవ‌డం బూమరాంగ్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

కొత్త పార్టీ అంటూ కేసీఆర్ సంకేతాలు ఇవ్వ‌డం సాధ్య‌ప‌డే ప‌రిస్థితి కాదు. ఇప్ప‌టికే ఎంఐఎం అధినేత అస‌రుద్దీన్ ఓవైసీ దేశ వ్యాప్తంగా ఆ పార్టీని విస్త‌రింప చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో కొంత మేర‌కు ఉనికి కాపాడుకున్నారు. ఆ పార్టీకి ముస్లిం ఓటు బ్యాంకు దేశ వ్యాప్తంగా అట్రాక్ట్ అవుతుంది. కానీ, కేసీఆర్ కొత్త పార్టీ పెడితే, ఆయ‌న వెంట‌న వ‌చ్చేది ఎవ‌రు? అనే ప్ర‌శ్న వేసుకుంటే సమాధానం ఉండ‌దు. తెలంగాణ రాష్ట్రంలో కేవ‌లం రెండు శాతం ఉండే వెల‌మ సామాజిక‌వ‌ర్గం రాజ్యాధికారాన్ని క‌లిగి ఉంది. బ‌ల‌మైన రెడ్డి సామాజిక‌వ‌ర్గంతో పాటు బీసీలు కూడా ఆయ‌న్ను ట‌చ్ చేయ‌లేక‌పోతున్నారు. బ‌హుశా ఇదే ధీమాతో దేశ వ్యాప్తంగా త‌న‌కు తిరుగుండ‌ద‌ని భావించొచ్చు. కానీ, మ‌త, కుల ప్రాతిపాదిక‌న ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఆయ‌న చెప్పే కొత్త పార్టీకి స్థానం ఎక్క‌డ‌? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

మూడో కూట‌మి, ఫ్రంట్‌, స్టంట్, పార్టీ గుంపు ఈసారి ప‌నిచేయ‌వ‌ని ఆయ‌న చెబుతున్నారు. అంటే, పీకేతో కేసీఆర్ చ‌ర్చించిన త‌రువాత ఇలాంటి ఈక్వేష‌న్ కేసీఆర్ చెబున్న‌ట్టు ఉన్నారు. దేశానికి ప్ర‌త్యామ్నాయ ఎజెండా అంటూ కేసీఆర్ ముందుకొస్తున్నారు. మోడీ స‌ర్కార్ ను ప్ర‌త్యామ్నాయ ఎజెండాతో ఢీ కొట్టాల‌ని ఆయ‌న ప్లాన్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉండే ప్ర‌జ‌లు కేసీఆర్ చెప్పే ప్ర‌త్యామ్నాయ నినాదాన్ని వినే ఛాన్స్ తక్కువ‌. ఆర్థికంగా బ‌లంగా ఉన్న కేసీఆర్ తో పీకే పార్టీ పెట్టించే ప్ర‌య‌త్నం చేయ‌డానికి అవ‌కాశం ఉంది. కానీ, ఉత్త‌రాది రాష్ట్రాలు ఆయ‌న్ను ఆద‌రించే అవ‌కాశం క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌దు. పైగా తెలంగాణలోని ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆయ‌న్ను రాజ‌కీయంగా దేశ వ్యాప్తంగా డ్యామేజ్ చేయ‌డానికి ఏ మాత్రం వెనుకాడ‌వు. బంగారు తెలంగాణ సెంటిమెంట్ స్లోగ‌న్ లోని డొల్ల‌త‌నాన్ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు జాతీయ స్థాయిలో వెలుగెత్తి చాటుతాయి. ఫ‌లితంగా ఇటు తెలంగాణ అటు దేశ వ్యాప్తంగా కేసీఆర్ చ‌తికిల‌ప‌డ‌తార‌ని అంచ‌నా వేసే వాళ్లు ఎక్కువ‌గా ఉన్నారు.