Site icon HashtagU Telugu

Hyderabad Lok Sabha : ‘మజ్లిస్‌’ కంచుకోటలో కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ

Hyderabad Lok Sabha

Hyderabad Lok Sabha

Hyderabad Lok Sabha : కాంగ్రెస్ పార్టీ  ఇంకా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం లోక్‌‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ప్రత్యేకించి హైదరాబాద్ స్థానానికి హస్తం పార్టీ అభ్యర్థి ఎవరు ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికార పీఠంపై ఉండటంతో అక్కడ బరిలోకి దింపే అభ్యర్థిపై అంతటా ఆసక్తి నెలకొంది. బీజేపీ ఇప్పటికే బలమైన అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు టికెట్ ఇవ్వగా.. కాంగ్రెస్ కూడా బలమైన నేతకు టికెట్ కేటాయిస్తే మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఎదురుగాలి వీచే అవకాశాలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ పలువురి పేర్లను హైదరాబాద్ సీటు కోసం పరిశీలిస్తోందనే వార్తలు ఇటీవల తెరపైకి వచ్చాయి. స్టార్ టెన్నిస్ ప్లేయర్  సానియా మీర్జాకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. దీనిపై సానియా స్పందన మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు. ఒకవేళ ఆమె నో చెబితే.. నాంపల్లి నేత ఫిరోజ్ ఖాన్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు చేస్తారని తెలుస్తోంది. అజారుద్దీన్ పేరు కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు. అయితే ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోవడం అజారుద్దీన్‌కు మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఆయనను ఇకపై నామినేటెడ్ పదవులకే పరిమితం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒక బీసీ  హిందూ నేత పేరు హైదరాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయనుందనే ప్రచారం తాజాగా మొదలైంది.

We’re now on WhatsApp. Click to Join

బలమైన ముస్లిం అభ్యర్థిని బరిలోకి దింపితే..

ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలమైన ముస్లిం అభ్యర్థిని బరిలోకి దింపితే.. ఒవైసీ కష్టాల్లో పడతారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హిందూ అభ్యర్థిని హస్తం పార్టీ పోటీకి నిలిపితే.. ఇప్పటికే బీజేపీ కూడా హిందూ అభ్యర్థిని బరిలోకి దింపినందుకు వర్గాల వారీగా ఓట్ల చీలిక జరుగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. హిందూ ఓట్లు చీలి పోవడం వల్లే ఇప్పటివరకు హైదరాబాద్ స్థానంలో మజ్లిస్ ఏకపక్ష విజయాలను నమోదు చేస్తూ వచ్చిందని పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో యాకుత్పురా స్థానంలో 800 ఓట్ల తేడాతోనే మజ్లిస్ అభ్యర్థి  గెలిచారు. బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల హిందూ అభ్యర్థుల మధ్య ఓట్లను చీల్చడంతోనే అది సాధ్యమయింది.  నాంపల్లిలో కేవలం 2వేల ఓట్ల తేడాతో  ఫిరోజ్ ఖాన్ ఓడిపోయారు. మలక్ పేటలో మజ్లిస్‌కు ఎప్పుడూ గట్టి పోటీ ఉంటుంది. నాంపల్లి, మలక్ పేటలో కాంగ్రెస్ పుంజుకోవడం మజ్లిస్‌కు డేంజర్ గా మారింది. ఈపరిణామాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానానికి గట్టి ముస్లిం అభ్యర్థిని నిలబెడతారన్న ప్రచారంతో ఒవైసీ అప్రమత్తమై.. కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు రెడీ అయ్యారనే అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే పలువురు ముస్లిం నాయకుల పేర్లు పరిశీలనకు వచ్చినా వాటిని పక్కనబెట్టి బీసీ అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని హస్తం పార్టీ యోచిస్తోందట. హైదరాబాద్‌లో ఎంఐఎంకు సహకరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇతర సీట్లలో ముస్లిం ఓట్లను పొందొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.

Also Read :Atal Pension Yojana: నెల‌కు రూ. 5000 పింఛ‌న్ పొందండిలా.. ముందుగా మీరు చేయాల్సింది ఇదే..!

బీజేపీ సీరియస్ 

ఈసారి హైదరాబాద్ స్థానాన్ని బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది.  ఆ పార్టీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత పాతబస్తీలోనే పుట్టి పెరిగారు. వృత్తి, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లినా.. తిరిగొచ్చి  పాతబస్తీ కేంద్రంగానే సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె హిందూ ఓటర్లను ఏకం చేసే కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి హైదరాబాద్‌లో గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు.