Site icon HashtagU Telugu

Congress : కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక కేసీఆర్ చ‌ర్ల‌ప‌ల్లి జైలుకే : మాజీ మంత్రి పొన్నాల

Ponnala Lakshmaiah complaint to Rahul Gandhi Regarding Janagaon DCC President

Ponnala Lakshmaiah complaint to Rahul Gandhi Regarding Janagaon DCC President

వ‌చ్చే ఎన్నిక‌ల త‌రువాత కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుందిని టీకాంగ్రెస్ సీనియ‌ర్ నేత పొన్నాల‌క్ష్మ‌య్య అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక కేసీఆర్‌ని ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ నుంచి నేరుగా చర్లపల్లి జైలుకు వెళ్ల‌డం ఖాయమని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జోస్యం చెప్పారు.కేసీఆర్, ఆయన కుటుంబం అక్రమంగా కూడబెట్టిన ఆస్తులన్నింటినీ రికవరీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జాతీయ రాజకీయాలకు దిక్సూచిగా మారనుందని పొన్నాల అన్నారు.

2014 నుంచి రాజకీయాల నిర్వచనం పూర్తిగా మారిపోయిందని.. కేంద్రంలో, రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు బ్రిటీష్‌వారిలా ఆస్తులను దోచుకోవడం మొదలుపెట్టారన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, హర్ ఘర్ జల్ వంటి నరేంద్ర మోదీ చాలా ప్రచారం పొందిన కార్యక్రమాలు కాగితాలపైనే మిగిలిపోయాయని ఆయన అన్నారు. విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికితీస్తామని, దేశంలోని ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పిన మోదీ.. ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేద‌న్నారు. 2013 చివరి నాటికి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు రూ. 14,000 కోట్లకు పైగా ఉండగా.. ఇప్పుడు అది 31,700 కోట్లకు చేరుకుందని పొన్నాల‌ చెప్పారు. మోదీ మీడియా మెరుపుదాడుల వల్ల దేశానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది కానీ నిరుద్యోగ యువత కేకలు గాలికి అల్లాడుతూనే ఉన్నాయన్నారు.