మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి మంత్రి సబితారెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. మంత్రాలయ చెరువు వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న తీగల, చెరువుల పరిరక్షణ కోసం ఆమరణ దీక్ష చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. మీర్ పేట, బడంగ్ పేటలో ట్రంక్ లైన్ నిర్మాణం ఇప్పటి వరకు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మేయర్ గా గ్రేటర్ హైదరాబాద్ డెవలప్ మెంట్ కోసం ఎంతో పనిచేశానని, తన కనుసన్నల్లో డెవలప్ మెంట్ జరిగిందనీ, తాను ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదని తీగల అన్నారు.
మీర్‌పేట్‌ను సబిత నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. చెరువులు, పాఠశాలల స్థలాలను వదలడం లేదని తీగల ఆరోపించారు. తమ పార్టీ నుంచి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదన్నారు. అభివృద్ధిని ఆమె గాలికొదిలేశారని విమర్శించారు. మంత్రి సబిత వైఖరిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని తీగల కృష్ణారెడ్డి చెప్పారు. అయితే టీఆర్ఎస్ కు తీగలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీకేఆర్ కు కేటీఆర్ ఫోన్ చేసి సముదాయించడంతో కాంగ్రెస్ లో చేరడంపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.