Khammam : ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మాజీ మంత్రి విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌లు.. సొంతగూటికి వెళ్ల‌బోతున్నారా..?

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో రాజ‌కీయాల్లో పెను మార్పులు రాబోతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఖ‌మ్మం జిల్లాలో బ‌ల‌మైన రాజ‌కీయ...

  • Written By:
  • Updated On - November 20, 2022 / 08:57 AM IST

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో రాజ‌కీయాల్లో పెను మార్పులు రాబోతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఖ‌మ్మం జిల్లాలో బ‌ల‌మైన రాజ‌కీయ నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఇటీవ‌ల విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న త‌న అభిమానులు, అనుచ‌రుల‌తో ఆత్మీయ స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స‌మావేశాల‌తో ఒక్క‌సారిగా జిల్లా రాజ‌కీయాలు హీటెక్కాయి. తుమ్మ‌ల పార్టీ మార‌బోతున్నారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఈ స‌మావేశాల్లో మాత్రం కేసీఆర్ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌ర‌చాలంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అంద‌రిలో అయోమ‌యానికి గురి చేస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన రెండు స‌భల్లో తుమ్మ‌ల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో పాల్గొన్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకి టీడీపీ కార్య‌క‌ర్త‌లు అడుగ‌డుగునా నీరాజ‌నం ప‌ట్టారు. ఆ త‌రువాత భారీ కాన్వాయ్‌తో భ‌ద్రాది వెళ్లారు. అక్క‌డ కూడా ఆయ‌న అభిమానులు, అనుచ‌రులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. తాను ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే టీఆర్ఎస్ లో చేరాన‌ని… మంత్రిగా ప‌ని చేసి ఖ‌మ్మం రైతుల క‌న్నీళ్లు తుడిచాన‌ని ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్ర‌బాబు హ‌యాంలో జిల్లాలో అభివృద్ధి ప‌నులు చేశాన‌ని.. రాష్ట్రం విడిపోయిన త‌రువాత జిల్లా అభివృద్ధి కోసం టీఆర్ఎస్‌లో చేరాన‌ని తెలిపారు.

అయితే తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాత్రం కేసీఆర్ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌ర‌చాలంటున్నా జిల్లా నాయ‌కులు మాత్రం ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం లేదు. రెండు రోజుల క్రితం స‌త్తుప‌ల్లిలో జ‌రిగిన రాజ్య‌స‌భ స‌భ్యుల స‌న్మాన స‌భ‌కు జిల్లా సీనియ‌ర్ లీడ‌ర్ తుమ్మ‌ల‌కు ఆహ్వానం కూడా పంప‌క‌పోవ‌డంతో ఆయ‌న అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. స‌త్తుప‌ల్లి న‌డిబోడ్డున జ‌రుగుతున్న స‌భ‌లో ఆయ‌న లేక‌పోవ‌డం ఇప్పుడు టీఆర్ఎస్‌లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఒక‌వైపు జిల్లాలో తుమ్మ‌ల సుడిగాలి ప‌ర్య‌ట‌నలు.. మ‌రోవైపు సొంత పార్టీ నేత‌లు ఆయ‌న్ని పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఆహ్వానించ‌క‌పోవ‌డంతో తుమ్మ‌ల కూడా త‌న దారి తాను చూసుకుంటున్నార‌ని టాక్ వినిపిస్తుంది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం వ‌స్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న రాజ‌కీయ జీవితం ప్రారంభించిన టీడీపీలోకి మాజీ మంత్రి తుమ్మ‌ల వెళ్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. టీడీపీలోకి వెళ్తే పూర్తిస్థాయిలో తుమ్మ‌ల‌కు తెలంగాణ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. అయితే ప్ర‌స్తుతం తుమ్మ‌ల ఈ ప్ర‌చారాన్ని ఖండిస్తున్న‌ప్ప‌టికీ సొంత‌గూటికి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని జిల్లాలో చ‌ర్చ జ‌రుగుతుంది. మ‌రీ మాజీ మంత్రి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.