Tummala : అందుకోస‌మే టీఆర్ఎస్‌లోకి వెళ్లా.. ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో మాజీ మంత్రి తుమ్మ‌ల‌

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయ ప‌రిణామాలు మార‌బోతున్నాయా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. మాజీ మంత్రి తుమ్మ‌ల...

  • Written By:
  • Publish Date - October 28, 2022 / 10:25 PM IST

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయ ప‌రిణామాలు మార‌బోతున్నాయా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో పాల్గొన్నారు. ఈ ఉత్స‌వాలు టీడీపీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగాయి. స‌త్తుప‌ల్లి నుంచి ఎన్టీఆర్ కెనాల్ వ‌ర‌కు టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. టీడీపీ జెండాల‌తో జ‌రిగిన ఈ ర్యాలీలో తుమ్మ‌ల పాల్గొన‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స‌మావేశంలో మాట్లాడిన నాయ‌కుల మాట‌లు కూడా ఆసక్తిక‌రంగా మారాయి. తెలంగాణ టీడీపీ నేత తాళ్లూరి జీవ‌న్ కుమార్ మాట్లాడుతూ .. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాని అభివృద్ధి చేసిన నేత మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాత్ర‌మేన‌న్నారు. ఇదే వేదిక‌, ఇదే ర్యాలీ, ఇవే జెండాలు పాలేరులో నియోజ‌క‌వ‌ర్గంలో ఎగ‌రాల‌ని ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌ళ్లీ ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు చ‌క్రం తిప్పాల‌ని ఆయ‌న అన్నారు. విజ‌న్ ఉన్న నాయ‌కుడు ఖ‌చ్చితంగా జిల్లాకు కావాల‌ని.. ఆ ర‌క‌మైన నిర్ణ‌యం భ‌విష్య‌త్‌లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు నుంచి వ‌స్తుంద‌ని భావిస్తున్నామ‌ని జీవ‌న్ కుమార్ అన్నారు

Tummala 

నాడు ఎన్టీఆర్ పిలుపు మేర‌కు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల‌ను శాసించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలోనే మంత్రిగా ప‌ని చేసిన ఆయ‌న‌.. రాష్ట్రం విడిపోయిన త‌రువాత టీడీపీ నుంచి టీఆర్ఎస్‌కు వెళ్లారు, 2014 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తుమ్మ‌ల‌కు టీఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. 2014 నుంచి మ‌ళ్లీ జిల్లాలో తుమ్మ‌ల‌కు ఎదురులేకుండా పోయింది.అయితే గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మ‌ల ఓడిపోవ‌డంతో ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో ఏ ప‌ద‌వి లేకుండా ఉన్నారు. పాలేరులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన కందాల ఉపేంద‌ర్ రెడ్డి టీఆర్ఎస్‌లోకి రావ‌డంతో అక్క‌డ వ‌ర్గ‌పోరు తీవ్రత‌రం అయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నేను అంటే నేను ఇక్క‌డ పోటీ చేస్తానంటూ ఇరువురు ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటున్నారు.

అయితే నిన్న జ‌రిగిన ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు తాను రెండు జిల్లాల రైతుల భ‌విష్య‌త్‌, రైతుల పిల్ల‌ల సుఖ‌సంతోషాల కోస‌మే టీఆర్ఎస్‌లోకి వెళ్లాన‌ని తెలిపారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో తాను ఖ‌మ్మం జిల్లాకు నీళ్లు అందించేందుకు కృషి చేశాన‌ని.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక మ‌ళ్లీ ప్రాజెక్టులు పూర్తి చేశాన‌న్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన అవ‌కాశంతోనే ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాని స‌స్య‌శ్యామ‌లం చేశాన‌ని మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు తెలిపారు.