Site icon HashtagU Telugu

CL Rajam: టీఆర్‌ఎస్‌లో ‘రాజం’ పెద్దన్న పాత్ర!

Cl Rajam

Cl Rajam

సీఎల్ రాజం.. ఉన్నత విద్యావంతులు, కాంట్రాక్టర్ కూడా. జర్నలిజం పై ఆసక్తితో ‘నమస్తే తెలంగాణ’ పత్రికను నెలకొల్పారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలోనూ రాజం తనదైన పాత్ర వహించారు. ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాల చెక్ ల పంపిణీ చేసి గొప్ప మనసును చాటుకున్నారు. పత్రికను విజయవంతంగా నడిపిన ఆయన కేసీఆర్ కు సన్నిహితంగా మెలిగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో రాజంకు సముచిత స్థానం ఉంటుందని భావించారు చాలామంది. కానీ సీన్ కట్ చేస్తే.. రాజం నమస్తే తెలంగాణ సీఎండీ గా బాధ్యతల నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత బీజేపీలో చేరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్ వల్లే పత్రిక బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వార్తలు సైతం వినిపించాయి.

బ్రాహ్మణ కోటా కింద రాజ్యసభ నామినేషన్‌తో సహా పాటు ఇతర  ప్రయోజనాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ కేసీఆర్ రాజంను విస్మరించడంతోనే బీజేపీలో చేరారని సమాచారం. అయితే బీజేపీలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై దాడికి, మోసాలను బయటపెట్టడానికి ఆయన మరో తెలుగు దినపత్రిక విజయ క్రాంతిని ప్రారంభించారు,  కానీ దానిని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు. ఆ తర్వాత తన కాంట్రాక్టులు, ఇతర వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టారు.

ఇప్పుడు హఠాత్తుగా యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవంలో కేసీఆర్‌తో కలిసి రాజం ప్రత్యక్షమై పూజాకార్యక్రమాల్లో పాల్గొంటూ మరోసారి చర్చనీయాంశమయ్యారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో రూ.800 కోట్లతో అభివృద్ధి చేసే బాధ్యతను రాజంకు అప్పగిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాకు చెందిన రాజంకు వేములవాడ దేవాలయం పట్ల ప్రత్యేక అనుబంధం ఉంది. ఆలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను కేసీఆర్ అప్పగిస్తే,  సీఎల్ కు పెద్ద వరం అవుతుంది. మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో రాజంకు రాజ్యసభ టికెట్‌ ఇస్తానన్న హామీని కేసీఆర్ నెరవేర్చే అవకాశం ఉందని కూడా వార్తలొస్తున్నాయి. అదే జరిగితే రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్‌లో రాజం పెద్దన్న పాత్ర పోషించడం ఖాయమే!

Exit mobile version