Site icon HashtagU Telugu

BRS Party: బీఆర్ఎస్ పార్టీకి మ‌రో షాక్‌.. మాదిగ‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని ఆ పార్టీకి రాజీనామా చేసిన కీల‌క నేత

Mandula Samuel

Mandula Samuel

తెలంగాణ (telangana)  రాష్ట్రంలో మ‌రో మూడునాలుగు నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీలైన కాంగ్రెస్‌ (Congress), బీజేపీ (BJP) నేత‌లు త‌మ రాజ‌కీయ‌ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ అధికార పార్టీని వీడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టికెట్ రాద‌ని భావిస్తున్న అనేక మంది నేత‌లు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా సూర్యాపేట జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన‌ కీల‌క నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రాథ‌మిక సభ్యత్వానికి, పార్టీ పదవికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మందుల సామ్యేల్ రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ గా, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా గ‌తంలో పనిచేసిన మందుల సామ్యేలు.. బీఆర్ఎస్‌లో మాదిగల‌కు తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్య‌క్తం చేశారు. గురువారం తుంగతుర్తి ప్రగతి నివేదన సభలో గాదరి కిషోర్‌కు మరోసారి ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. దీంతో కిషోర్‌కు సీటు ఖాయ‌మ‌ని స్ప‌ష్ట‌మైంది. ఈ క్ర‌మంలో సామ్యేలు వ‌ర్గం తీవ్ర అసంతృప్తిలో ఉంది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో మాదిగ‌ల‌కు అవ‌మానం జ‌రుగుతుంద‌ని సామ్యేల్ ఆ పార్టీ రాజీనామ చేశారు.

ఈ సంద‌ర్భ‌గా సామ్యేల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. మాదిగలులేని కాబినెట్ ప్రభుత్వం ఇదేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవరికోసం తెలంగాణ.. మాలమదిగలకు ఎంతమందికి దళితంబంధు ఇచ్చారు అంటూ ప్ర‌శ్నించారు. ఈ ప్రభుత్వంలో మాదిగల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తెలంగాణ వచ్చినా మాదిగల జీవితంలో మార్పులేదు. ప్రగతి భవన్లో అడుగుపెట్టే అవకాశం లేదు సామ్యేల్ అన్నారు. మాదిగల సమస్యలు చెప్పుకునే అవకాశం లేద‌ని, ఎన్నిసార్లు మోరపెట్టుకున్నా ఫలితం లేదని సామ్యేల్‌ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా నేను కట్టిన గిడ్డంగులను నన్ను పిలవకుండా ప్రారంభించారని, క‌నీసం కేటీఆర్ సభకుకూడా పిలుపు లేదని అన్నారు. మాదిగల వ్యతిరేకులకు చావుడప్పు కొట్టాల‌ని సామ్యేల్ మాదిగ సామాజిక వ‌ర్గానికి పిలుపునిచ్చారు. మాదిగల మెజారిటీ ఉన్న ప్రాంతాల్లోకూడా మాదిగలకు గుర్తింపు లేదని, ఎవరూ.. జెండా మోయని నాడు నేను జండా మోసి పార్టీని నిలబెట్టానని అన్నారు. నాకు పోటీగా వలస మాలను తుంగతుర్తిలో నిలబెట్టారు. అతిపెద్ద అంబెడ్కర్ విగ్రహం ఉంటే ఎంది లేకుంటే ఏంటి? అంటూ అధికార పార్టీపై విమ‌ర్శ‌లు చేశారు.

రాష్ట్ర కార్యదర్శినైన నాకే గుర్తింపు లేదు. అందుకే రాజీనామా చేశా. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా. నన్ను ఆశీర్వదించండి అంటూ సామ్వేల్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను కోరారు. కొద్ది రోజుల్లో చర్చించి భవిష్యత్తు నిర్ణయం ప్ర‌క‌టిస్తాన‌ని, కచ్చితంగా తుంగతుర్తి అసెంబ్లీ భరిలో ఉంటా, అయితే, ఏ పార్టీ నుండి అనేది త్వరలో చెబుతా అంటూ రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ మాజీ చైర్మన్ మందుల సామ్యేలు అన్నారు.