Site icon HashtagU Telugu

Etela Vs Bandi: తెలంగాణ బీజేపీలో వర్గ పోరు.. ఈటెల టార్గెట్?

Etela Vs Bandi: తెలంగాణ బీజేపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంటుంది. ఈటెల వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా ఆ పార్టీలో చీలిక మొదలైంది. రాజకీయాల్లో లుకలుకలు సహజమే. కానీ పెద్దన్న పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. దీంతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. దీనిపై ఢిల్లీ పెద్దలు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హీట్ పుట్టిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల్లో అంతర్గత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణాలో బీజేపీ ఉనికి కోల్పోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం వర్గ పోరు. ఓ పార్టీలో నాయకులు కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. కానీ వర్గాలుగా విడిపోయి ఇతర పార్టీల ముందు చులకనగా తయారైతే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడుతుందనడంలో సందేశమే లేదు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో వర్గ పోరు పటాపంచలు అవుతుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay), ఈటెల రాజేందర్ (Etela Rajender) ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో బీజేపీ సంక్షోభంలో పడే ప్రమాదం లేకపోలేదు.

బండి సంజయ్ కి వ్యతిరేకంగా ఈటెల రాజేందర్ గ్రూప్ రాజకీయాలు చేస్తున్నట్టు ఆ పార్టలోని కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఢిల్లీ పెద్దలకు కంప్లైంట్ చేసేందుకు కూడా సిద్దపడుతున్నారట. ఈ క్రమంలో బండికి సీనియర్స్ అండగా ఉంటున్నారు. ఈ సందర్భంగా ఈటెలకు వ్యతిరేకంగా బీజేపీ సీనియర్స్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో భేటీ అయినట్లు తెలుస్తుంది. మాజీ ఎంపీలు వివేక్, విజయశాంతి, రవీంద్ర నాయక్, విఠల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారని సమాచారం.

ఈటల తీరుపై నేతలు సీరియస్ అవుతూ, పదవుల కోసం ఈటల ఢిల్లీ లో పైరవీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలాన్ని ఈటల తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని సీనియర్ల తీర్మానించుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా బండి సంజయ్ ప్రోత్సాహంతోనే సీనియర్లు భేటీ అయ్యారని ఈటల వర్గం ఆరోపిస్తుంది. దీంతో తెలంగాణ బీజేపీ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. తమకు అసలైన నాయకుడు ఎవరో అర్ధం కాకా ఆలోచనలో పడుతున్నారు. ఒకవైపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ బండి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళుతుందని హైకమాండ్ ప్రకటించింది. కానీ తెలంగాణ రాజకీయాల్లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. త్వరలోనే బీజేపీ అధ్యక్ష పదవిలో మార్పు ఉండబోతోందనే సంకేతాలు కనబడుతున్నాయి. దీంతో వర్గ పోరు ఎటు దారి తీస్తుందనే ఆందోళనలో పార్టీ శ్రేణులు ఉన్నారు.

Read More: Telangana BJP : తెలంగాణ బీజేపీకి ఏమైంది..? కాంగ్రెస్ దూకుడుతో తేలిపోతున్న క‌మ‌లం.. కోవ‌ర్టులే కార‌ణ‌మా?

Exit mobile version