Site icon HashtagU Telugu

Etala : హుజురాబాద్ ప్రజలు కేసీఆర్, హరీశ్ రావుకు కర్రుకాల్చి వాతపెట్టారు!

హుజురాబాద్ లో జరిగిన ఉప ఎన్నిక పోరులో ఈటల రాజేందర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా దళితబంధును ప్రకటించినా.. డబ్బును వెదజల్లినా.. ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకున్నా.. పలువురికి నామినెటేడ్ పోస్టులు కట్టబెట్టినా ఈటల విజయాన్ని ఆపలేకపోయాయి. హుజురాబాద్ ప్రజలకు ఎన్నోఏళ్లుగా సేవలందించడం.. నిత్యం ప్రజలతో మమైకకావడం.. పలుమార్లు మంత్రి, ఎమ్మెల్యేగా పనిచేసినా అవినీతి మరక అంటకపోవడం లాంటివన్నీ ఈటలకు తిరుగులేని విజయాన్ని అందించాయి. అయితే ఈటల బీజేపీలో చేరకముందు ఆయన వెన్నంటి ఉన్నకొంతమంది పదవులకు, డబ్బులకు ఆశపడి ఈటలకు వ్యతిరేకంగా పనిచేశారు. ఈ విషయాన్ని ఈటల ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. తనపై దుష్ప్రచారం చేసినవాళ్లను, వ్యతిరేక శక్తులను వదిలేది లేదనీ ఈటల బహిరంగంగా సవాల్ విసిరారు. ఈనేపథ్యంలో ఈటల రాజేందర్ ట్రబుల్ షూటర్ అయిన హరీశ్ రావుపై గురి పెట్టినట్టు తెలుస్తోంది.

హుజురాబాద్ ఉప ఎన్నిక మొదలైందో, అప్పట్నుంచే హరీశ్ రావు ముమ్మర ప్రచారం చేయడం, ఈటలను పదే పదే విమర్శించడం, డబ్బు, మద్యంతో ప్రభాలోల పర్వదానికి దిగడం, బీజేపీతో వచ్చేదీ ఏమిలేదని ప్రచారం చేయడంలాంటివన్నీ ఈటలకు విసుగు తెప్పించాయి. ఎమ్మెల్యే గా గెలిచిన ఈటల టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. తాజాగా ఈటల కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సందర్భంగా బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మరోమారుపై హరీశ్ రావును లక్ష్యంగా చేసుకొని విమర్శించారు. తన నియోజకవర్గంలో దళితబంధు అమలు చేశారని, ఆ దళితబంధును సిద్దిపేట, గజ్వేల్ సహా తెలంగాణ అంతటా అమలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. సిద్దిపేటలో కూడా దళిత గర్జన సభ పెట్టే రోజు వస్తుందని, దానికి తానే నాయకత్వం వహిస్తానని ఈటల ప్రకటించారు. బీజేపీకి ఓటు వేస్తే పెన్షన్ పోతుందని, సంక్షేమ పథకాలు రావని, రేషన్ కార్డు పోతుందంటూ రోజుకో అబద్ధం చెప్పి నీచానికి ఒడిగట్టారని అన్నారు. హుజురాబాద్ ప్రజలు ప్రగతి భవన్‌లో కూసున్న కేసీఆర్‌కు, సిద్దిపేటలో కూసుని కుట్రలు చేసిన హరీశ్ రావుకు కర్రుకాల్చి వాత పెట్టారని ఈటల అన్నారు.