Etela Rajender : పదవిని పొందేటప్పుడు ఉండే ఆరాటం, పని చేసేటప్పుడు కూడా ఉండాలని బీజేపీ శ్రేణులకు ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. ‘‘పార్టీలో అటెండెన్స్ సిస్టం ఉండొద్దు. చేతులు ఎత్తే పద్ధతి ఉండొద్దు. ఇది ఇన్సల్ట్ చేసే పద్ధతి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మేడ్చల్ జిల్లా బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఈటల ఈ కామెంట్స్ చేశారు. ‘‘పార్టీ పదవులు పొంది కూడా.. పార్టీ కోసం పనిచేయని వారు రాజీనామా చేయాలి. అలాంటి విషయాల్లో రాజీపడే ప్రసక్తే లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీలో డివిజన్ అధ్యక్షుడు, ఆపై స్థాయి కలిగిన నేతలంతా 24 గంటలూ అందుబాటులో ఉండాలన్నారు. లేదంటే పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తుందన్నారు. తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఈటల(Etela Rajender) తెలిపారు. ఆ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read :Chinas No 2 Missing : చైనాలో నంబర్ 2 మాయం.. జిన్‌పింగ్ సన్నిహితుడికి ఏమైంది ?
మంత్రి శ్రీధర్‌బాబుతో ఈటల భేటీ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. మల్కాజిగిరి ఎంపీ స్థానం పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. తాగునీటి సరఫరా వ్యవస్థ, రోడ్లు సరిగ్గా లేవన్నారు. హైడ్రా పేరిట డబ్బులు వసూలు చేస్తున్న బ్లాక్‌మెయిలర్లపై దృష్టి సారించాలని కోరారు. చిన్న దేవాలయాలను కూడా దేవదాయశాఖ పరిధిలోకి తీసుకురావడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఈటల చెప్పారు. హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా డంపింగ్ యార్డులు ఉంటే బాగుంటుందని సూచించారు. నగరంలోని మొత్తం చెత్తను బాలాజీనగర్‌కు పంపిస్తే అక్కడి ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతోందన్నారు. తన లోక్‌సభ స్థానం పరిధిలోని కాంట్రాక్టర్ల బిల్లులను సకాలంలో విడుదల చేయాలని మంత్రిని ఈటల కోరారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారని ఈటల చెప్పారు.
రాజాసింగ్ మంచి నేత.. త్వరలోనే బీజేపీకి కొత్త చీఫ్ : బండి సంజయ్
‘‘రాజాసింగ్ ఆదర్శమైన నేత, ఆయన ఎల్లప్పుడూ హిందూ ధర్మం కోసమే గళం విప్పుతారు’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. రాజాసింగ్ లాంటి నేతకు సాటి ఎవరూ లేరని కితాబిచ్చారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని భర్తీ చేస్తారని వెల్లడించారు. బీజేపీలో అధ్యక్ష పదవికి అందరూ అర్హులేనని, ఎవరి వల్ల పార్టీకి లబ్ధి జరిగితే వాళ్లనే అధ్యక్షులుగా చేస్తారని సంజయ్ చెప్పారు. ఆ పదవిలో ఎవరు ఉండాలనేది కేంద్ర బీజేపీయే నిర్ణయిస్తుంది. ఆ విషయం మొత్తం జేపీ నడ్డా చేతిలో ఉంటుందన్నారు. ‘‘బీజేపీ త్వరలోనే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తుంది. పొత్తులపై అప్పటి తెలంగాణ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు’’ అని సంజయ్ తెలిపారు.