Site icon HashtagU Telugu

Etela Rajender: ఈటలకు కీలక పదవిస్తారా.. ఢిల్లీ టూర్ ఎందుకు?

Etala

Etala

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ రావాల్సిందిగా ఆయనకు బీజేపీ అధినాయకత్వం నుంచి పిలువు రావడం హాట్‌టాపిక్‌గా మారింది. ఢిల్లీ నుంచి సడెన్‌గా పిలుపు రావడంతో ఈటల మంగళవారం హస్తినకు బయలుదేరారు. గత కొంతకాలంగా బీజేపీలో ఈటల అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మంత్రిగా పనిచేసిన ఆయనకు చేరికల కమిటీ ఛైర్మన్‌ మినహా ఇతర కీలక పదవులు ఏమీ ఇవ్వలేదు. బీజేపీలో ప్రాధాన్యత దక్కడం లేదని ఈటల అసంతృప్తిగా ఉన్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. పలుమార్లు ఆయనను అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకుని బుజ్జగించారనే వార్తలు కూడా వినిపించాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మళ్లీ ఈటలకు పిలువు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈటలకు పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశముందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తోన్నాయి.

టీఆర్ఎస్ నేతలతో ఈటలకు మంచి పరిచయాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిలో ఆయనతో చాలామంది టచ్‌లో ఉన్నారు. దీంతో ఈటలకు ఏదైనా కీలక పదవి ఇస్తే.. పార్టీకి ప్లస్ అవుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోన్నట్లు చెబుతున్నారు. ఈటలతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణలను కూడా ఢిల్లీ అధిష్టానం పిలవడంతో హస్తినకు బయలుదేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారని ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నికలు ముగిసిన తర్వాత సీనియర్ నేతలకు ఢిల్లీ నుంచి పిలువు రావడంపై అనేక రకాల వార్తలు వినిపిస్తోన్నాయి. ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఈటల, డీకే అరుణ మంత్రులుగా పనిచేయగా.. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యం కలిగిన వీరికి బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు రావడం కాషాయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఈటల ఢిల్లీ టూర్ క్రమంలో ఆయనను సీఎం కేసీఆర్ తిరిగి టీఆర్ఎస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. డిప్యూటీ సీఎం పదవిని సీఎం కేసీఆర్ ఆఫర్ చేశారని, కానీ ఈటల టీఆర్ఎస్ ప్రతిపాదనను తిరస్కరించారనే వార్తలు తెలంగాణ రాజకీయాల్లో హల్‌చల్ చేస్తోన్నాయి. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలను కేసీఆర్ తిరిగి ఆహ్వానిస్తోన్నారు. అందులో భాగంగా స్వామిగౌడ్ లాంటి పలువురు నేతలు ఇప్పటికే తిరిగి సొంతగూటికి చేరారు. మరికొంతమంది త్వరలో చేరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.