Site icon HashtagU Telugu

Ponguleti Srinivas Reddy: ఈట‌ల వ్యాఖ్య‌ల‌తో క్లారిటీ.. కాంగ్రెస్‌లోకే పొంగులేటి, జూప‌ల్లి.. ముహ‌ర్తం ఎప్పుడంటే?

Etela Rajendar gives clarity on Ponguleti Srinivas Reddy and Jupalli Krishna Rao Party Change

Etela Rajendar gives clarity on Ponguleti Srinivas Reddy and Jupalli Krishna Rao Party Change

అభిమానులు, శ్రేయోభిలాషుల‌కు అమోద‌యోగ్య‌మైన పార్టీలోకే వెళ్తాం.. ఏ పార్టీలోకి వెళ్లేంది త్వ‌ర‌లో చెబుతాం.. అంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao)లు కొంత‌కాలంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నారు. వీరిద్ద‌రూ ఏ పార్టీలోకి వెళ్తున్నార‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చింది. అయితే, ఈ విష‌యంపై పొంగులేటి, జూప‌ల్లి క్లారిటీ ఇవ్వ‌లేదు. వారిని బీజేపీ(BJP)లోకి తీసుకెళ్లేందుకు తంటాలు ప‌డుతున్న బీజేపీ చేరిక‌ల క‌మిటీ చైర్మ‌న్ ఈట‌ల రాజేంద‌ర్(Etela Rajendar) క్లారిటీ ఇచ్చారు. పొంగులేటి, జూప‌ల్లి ఇద్ద‌రూ బీజేపీలోకి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని, వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు. బీజేపీలోకి వారిని ఆహ్వానించేందుకు తాను రోజూ వారితో ట‌చ్‌లో ఉంటూ వ‌స్తున్నాన‌ని, కానీ వారు తిరిగి నాకే కౌన్సిలింగ్ ఇస్తున్నార‌ని అన్నారు.

ఇంత‌కీ వారు ఎందుకు బీజేపీలో చేరేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు? కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లాల‌ని అనుకుంటున్నారు? అనే విష‌యంపైనా ఈట‌ల క్లారిటీ ఇచ్చేశారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో బీజేపీకి ఆశించిన స్థాయిలో క్యాడ‌ర్ లేదు. కాంగ్రెస్‌ బ‌లంగా ఉంది. అదేవిధంగా ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనూ కాంగ్రెస్ కు ప‌ట్టుంది. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌స్తుతం బీజేపీలోకి వ‌చ్చి ఇబ్బంది ప‌డ‌టం కంటే ఆయా ప్రాంతాల్లో బ‌లంగాఉన్న కాంగ్రెస్‌లోకి వెళ్లి విజ‌యం సాధించ‌డం మేల‌న్న దోర‌ణిలో వారు ఉన్న‌ట్లు ఈట‌ల చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికే పొంగులేటి, జూప‌ల్లి కాంగ్రెస్ పార్టీలో చేరిక తేదీకూడా ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 8 లేదా 10 తేదీల్లో వారు కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటార‌న్న ప్ర‌చారం విస్తృతంగా సాగుతుంది.

పొంగులేటి, జూప‌ల్లిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఈట‌ల తీవ్రంగానే శ్ర‌మించార‌ని చెప్పొచ్చు. ఈట‌ల సీనియ‌ర్ నేత. అయితే, ఆయ‌న ఎప్పుడూ పార్టీ విషయాల‌పై బ‌హిరంగంగా మాట్లాడ‌రు. కానీ, విలేక‌రుల‌తో క‌లిపించుకొని పొంగులేటి, జూప‌ల్లి బీజేపీలో చేర‌డం లేద‌ని చెప్ప‌డానికి ఏమైనా రాజ‌కీయ వ్యూహం ఉందా అనే చ‌ర్చ‌కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతుంది. మ‌రోవైపు ఈట‌ల వ్యాఖ్య‌లు బీజేపీలో క‌ల‌వ‌రం రేపుతున్నాయి. ఖ‌మ్మంలో బీజేపీ బ‌లంగా లేద‌ని ఈట‌ల చెప్ప‌డం ప‌ట్ల ఆ పార్టీలోని కొంద‌రు నేత‌ల్లో అస‌హ‌నం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

Also Read : YS Sharmila: అన్నకు పోటీగా చెల్లి.. ష‌ర్మిల సై అంటే తెలంగాణ‌, ఏపీల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభ‌వం