Liquor Scam : కేసీఆర్ `క్లూ`! మ‌నీల్యాండ‌రింగ్ పై ఈ`ఢీ`!

ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల‌పై రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ అప్ర‌మ‌త్తం అయ్యారు

  • Written By:
  • Updated On - September 6, 2022 / 12:02 PM IST

ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల‌పై రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ అప్ర‌మ‌త్తం అయ్యారు. ఆ మేర‌కు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల‌తో జ‌రిగిన స‌మావేశంలోనూ సంకేతాలు ఇచ్చారు. సుదీర్ఘంగా జ‌రిగిన మంత్రివ‌ర్గ భేటీలోనూ కేంద్రం వైఖ‌రిని ప్ర‌స్తావించారని తెలుస్తోంది. అంతేకాదు, మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభమైన వ‌ర్షాకాల అసెంబ్లీ స‌మావేశాల్లోనూ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌పై చ‌ర్చ‌కు ఉప‌క్ర‌మిస్తున్నార‌ని స‌మాచారం. రెండు రోజుల క్రితం కేసీఆర్ పార్టీ నేత‌ల‌కు సంకేతాలు ఇచ్చిన‌ట్టే ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ఆధారంగా ఈడీ దేశ వ్యాప్తంగా 32 చోట్ల తనిఖీల‌ను చేస్తోంది. ఢిల్లీ, హైద‌రాబాద్‌, బెంగుళూరు, ముంబై, గుర్గావ్ ప్రాంతాల్లో ఏక‌కాలంలో దాడులు నిర్వహిస్తూ మ‌నీ ల్యాండ‌రింగ్ కు సంబంధించిన ఆధారాల‌ను రాబ‌డుతోంది.

ప్ర‌త్యేకించి హైద‌రాబాద్ లోని రాబిన్ డిస్ట‌ల‌రీ కి సంబంధించిన వ్య‌వ‌హారాన్ని ఈడీ సీరియ‌స్ గా తీసుకుంది. దాని వెనుక ఉన్న బినామీల‌ను బ‌య‌ట‌కు లాగుతోంది. ఆ డిస్ట‌ల‌రీ పుట్టుపూర్వోత్త‌రాల‌ను అధ్య‌య‌నం చేసింది. ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా రాబిన్ డిస్ట‌ల‌రీకి సంబంధాలు ఉన్నాయ‌ని అనుమానిస్తూ అరుణ్ రామ‌చంద్ర పిళ్లై, సృజ‌న్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగ‌ర్‌, అభిషేక్ రావు ఇళ్ల‌లో ఈడీ సోదాల‌ను నిర్వ‌హిస్తోంది. వాళ్ల‌లో అభిషేక్‌ రావు, సృజ‌న్ రెడ్డికి, ప్రేమ్ సాగ‌ర్ కు తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌గా ఉన్న కుటుంబీకుల‌కు డైరెక్ట్ సంబంధాలు ఉన్న‌ట్టు ఈడీ అనుమానిస్తోంది. ఆ మేర‌కు త‌నిఖీల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలుస్తోంది. లిక్క‌ర్ స్కామ్ లింకుల‌న్నీ హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న‌ట్టు సీబీఐ గుర్తించింద‌ని వినికిడి. అందుకే, మ‌నీ ల్యాండ‌రింగ్ వ్య‌వ‌హారంకు సంబంధించిన ఆధారాల‌ను సేక‌రిస్తోంది.

ఇటీవ‌ల క్యాసినో గ్యాంబ్ల‌ర్ చిక్కోటి ప్ర‌వీణ్ కుమార్ ను ఈడీ విచారించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మ‌నీల్యాండ‌రింగ్ చేసిన ప్ర‌జాప్ర‌తినిధులు జాబితాను సేక‌రించింది. కొందరికి నోటీసులు కూడా జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ కేసులోనూ ప్ర‌స్తుతం లిక్క‌ర్ స్కామ్ లో ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల ప్ర‌మేయం ఉంద‌ని ఈడీ అనుమానిస్తోంద‌ట‌. అందుకే, ప‌క్కా స‌మాచారంతో ఈడీ హైద‌రాబాద్ లోని ఆరు ప్రాంతాల్లో త‌నిఖీల‌ను చేస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు గుమ్మ‌నంగా ఉన్న మ‌నీ ల్యాండ‌రింగ్ వ్య‌వ‌హారం ముదిరిపాకాన ప‌డింది. లిక్క‌ర్ స్కామ్ లో ఏపీ, తెలంగాణ‌కు చెందిన ప్ర‌భుత్వ పెద్ద‌ల ప్ర‌మేయం ఉంద‌ని రెండు వారాలుగా మీడియా కోడైకూస్తోంది. జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ మీడియాలోని కొంతభాగం లిక్క‌ర్ స్కామ్ గురించి ప‌లు వార్తల‌ను అందించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఇళ్లు, బ్యాంకు ఖాతాల‌ను గ‌త వారం సీబీఐ త‌నిఖీ చేసింది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగ‌డంతో ప‌క్కా ఆధారాల‌తో మ‌నీ ల్యాండ‌రింగ్ వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెడుతుంద‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈసారైన ఈడీ నిజాల‌ను బ‌య‌ట‌పెడుతుందా? గ‌తంలోని డ్ర‌గ్స్ కేసు, భూ స్కామ్ లు, మ‌నీ ల్యాండ‌రింగ్ , న‌యీమ్ ఆస్తులు త‌దిత‌ర కేసుల మాదిరిగా బుట్ట‌దాఖ‌లు అవుతుందా? అనేది చూడాలి.