Drugs Issue: ఇది అంతులేని ‘డ్రగ్స్’ కథ..!

‘‘తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల మాటే వినిపించకూడదు. డ్రగ్స్ కేసులో దోషులుగా తేలితే ఎంతటివారినైనా ఊపేక్షించేదీ లేదు. డ్రగ్స్ తో ప్రమేయం ఉన్న ప్రతిఒక్కరినీ అదుపులోకి తీసుకోవాలి.

  • Written By:
  • Updated On - January 27, 2022 / 02:05 PM IST

‘‘తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల మాటే వినిపించకూడదు. డ్రగ్స్ కేసులో దోషులుగా తేలితే ఎంతటివారినైనా ఊపేక్షించేదీ లేదు. డ్రగ్స్ తో ప్రమేయం ఉన్న ప్రతిఒక్కరినీ అదుపులోకి తీసుకోవాలి. వాళ్ల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలి’’ ఈ మాటలు అన్నది ఎవరో కాదూ… సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అవుతుండటంతో కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. డ్రగ్స్ వ్యవహరంపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని, దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు, పోలీసులు, టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ పై నిఘా పెడుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడిక్కడ పోలీసులు గస్తీ తిరగడంతో ఒక్క ములుగు జిల్లాలోనే 90 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది. దాదాపు 600కుపైగా ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవేకాకుండా పలు ప్రాంతాల్లో గంజాయి లాంటి నిషేధిత డ్రగ్స్ పట్టుబడ్డాయి. పడుతూనే ఉన్నాయి.

టోనీ నోరు విప్పితే..

చాంపకింద నీరులా డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటంతో పోలీసులు వాటి మూలాలు, కదలికలపై ఫోకస్ చేశారు. చిన్న చిన్న వ్యాపారస్తులను కాకుండా పెద్ద పెద్ద ముఠాలపై గురి పెట్టింది. ఈక్రమంలో కీలక డ్రగ్స్ స్మగ్లర్ టోనీ పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. డ్రగ్స్ స్మగ్లర్ టోనీ కేసులో గతంలో ఏడుగురు సంపన్నులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో 15 మంది వ్యాపారవేత్తలను గుర్తించారు.

బడాబాబులకు డ్రగ్స్ మరకలు

పోలీసులు గుర్తించిన 15మందిలో ప్రముఖ వ్యాపార వేత్తలు గజేంద్ర, విపుల్ ల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. కాగా గజేంద్ర, విపుల్‌లు హైదరాబాద్ నగరంలో బడా పారిశ్రామికవేత్తలుగా కొనసాగుతున్నారు. ఈ కేసులో నిందితులు గజేంద్ర, విపుల్. టోనీ దగ్గరి నుంచి కొన్నేళ్లుగా డ్రగ్స్ ను తీసుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అదేవిధంగా గజేంద్ర, విపుల్. హైదరాబాద్‌లో ఏటా రూ.500 కోట్ల పైచిలుకు వ్యాపారం చేస్తున్నారని, వీరు టోని నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. అలాగే వీరితో మరో 13 మందికి టోనీ డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు.

పోలీసుల ముమ్మర విచారణ

తెలంగాణ డ్రగ్స్ కేసు ఏళ్ల తరబడి విచారణలోనే ఉంది. ఇటీవల తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇది జరిగి ఏడాది కూడా కాలేదు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ టాస్క్ ఫోర్స్ డ్రగ్స్ కేసును విచారిస్తుంది. ఆ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సినిమా నటులను నెలల తరబడి విచారించారు. ఆ తరువాత సినిమా పెద్దకు ప్రభుత్వం పెద్దలను కలిశారు. ఒక్క సారిగా 2018 ఎన్నికల ముందు విచారణ నిలిచింది. మళ్ళీ ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల ముందు డ్రగ్స్ ఇష్యూ వచ్చింది . ఆ ఎన్నికలు ముగిసిన తరువాత డ్రగ్స్ విచారణ దాదాపు క్లోజ్ అయింది. సినిమా వాళ్లు ఎవరు డ్రగ్స్ కేసుకు సంబంధించి లేరు అని తేల్చేశారు. కానీ , ముంబయి, బెంగుళూర్ పోలీసులు విచారణలో మాత్రం హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ ముఠా ఉందని కూపీ లాగింది. ఆ విషయాన్ని తెలంగాణ పోలీస్ కు తెలియ చేసింది. దీంతో మళ్ళీ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది.

హడావుడి చేస్తారా.. అంతుచూస్తారా?

టోనీ తో పాటు 9 మంది నిందితులను 7 రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. కోర్టులో వాదనలు పూర్తి ఈరోజు కస్టడీ పై తీర్పు వచ్చే అవకాశం ఉంది. నిందితులను కస్టడీకి తీసుకుంటే మరింత సమాచారం వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. టోనీ దగ్గర నుండి కొన్నేళ్లుగా డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్న వ్యాపారవేత్తలను గుర్తించారు. మొత్తం 34 మంది ని గుర్తించిన పోలీసులు..ఇందులో ఇప్పటికే 9 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈసారి అయిన డ్రగ్స్ కేసు లోని అసలు విషయాలు బయటకు వస్తాయా? లేక గతంలో మాదిరి కొన్ని రోజుల హడావుడి మాత్రమేనా? అనేది చూడాలి.