Electricity Purchase Scam : తెలంగాణ డిస్కంలకు వేల కోట్ల నష్టం.. కారణం అదేనా ?

బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణకు విద్యుత్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగుచూశాయి. 

  • Written By:
  • Publish Date - June 18, 2024 / 11:15 AM IST

Electricity Purchase Scam : బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణకు విద్యుత్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగుచూశాయి.  ఛత్తీస్‌గఢ్‌ నుంచి  ఒక్కో యూనిట్‌ విద్యుత్‌ను రూ.3.90కి కొనుగోలు చేశామని మాజీ సీఎం కేసీఆర్ చెబుతున్నారు. అయితే  వాస్తవానికి ఆ ఖర్చు ఒక్కో యూనిట్‌కు రూ.5.64కు పెరిగిందని తెలంగాణ డిస్కంలు అంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణకు కుదిరిన ఒప్పందంలో యూనిట్ విద్యుత్ రేటు రూ.3.90 ఉండగా.. అసలు విద్యుత్ రేటు యూనిట్‌కు రూ.5.64కు చేరడంపై దుమారం రేగుతోంది. దీనివల్ల బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ డిస్కంలపై దాదాపు రూ.3,110 కోట్ల అదనపు భారం పడిందని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

2017 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం వరకు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ డిస్కంలు 17,996 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొన్నాయి. ఇందుకోసం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి రూ.7,719 కోట్లు చెల్లించాయి. ఇంకో రూ.1,081 కోట్ల బకాయిలను  ఛత్తీస్‌గఢ్‌కు తెలంగాణ డిస్కంలు కట్టాల్సి ఉంది. వీటికి అదనంగా కరెంటు సరఫరా లైన్‌ ఛార్జీల పేరిట తెలంగాణ డిస్కంలు మరో రూ.1,362 కోట్లు పే చేయాల్సి ఉంది. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి కొన్న యూనిట్ విద్యుత్ రేటు రూ.3.90 నుంచి రూ.5.64కు చేరింది. విద్యుత్ బకాయిలపై రెండు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల మధ్య వివాదం ఇంకా తేలలేదు. రూ.1,081 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని తెలంగాణ డిస్కంలు చెబుతుంటే.. రూ.1,715 కోట్లు తమకు తెలంగాణ నుంచి రావాల్సి ఉందని ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్తు సంస్థలు అంటున్నాయి. ఈ నగదును తెలంగాణ డిస్కంల నుంచి ఇప్పించాలంటూ ‘విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌’లో అవి పిటిషన్‌ వేశాయి. బకాయిల చెల్లింపుల వివాదంతో 2022 ఏప్రిల్‌‌ నుంచి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సంస్థలు తెలంగాణకు కరెంటు సరఫరాను ఆపేశాయి.

Also Read :Listen To This Page : ఇక గూగుల్ క్రోమ్‌లో చదవొద్దు.. వినేయండి..

2017 నుంచి 2022 మధ్య కాలంలో ఛత్తీస్‌గఢ్ నుంచి పూర్తిస్థాయిలో కరెంటు(Electricity Purchase Scam) రాకపోవడం వల్ల రూ.2,083 కోట్లు చెల్లించి బహిరంగ మార్కెట్లో కరెంటు కొనాల్సి వచ్చిందని తెలంగాణ డిస్కంలు అంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు తెచ్చుకునేందుకు పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ (పీజీసీఐఎల్‌)తో వెయ్యి మెగావాట్ల విద్యుత్ సరఫరాకు లైన్‌ కారిడార్‌ను తెలంగాణ డిస్కంలు అద్దెకు తీసుకున్నాయి. కరెంటు సరఫరా ఆగిపోయినా.. వాటికి అద్దెల కింద రూ.638 కోట్లను తెలంగాణ డిస్కంలు కట్టాయి. నష్ట పరిహారం కింద తమకు రూ.261 కోట్లను కట్టాలని తెలంగాణ డిస్కంలకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నోటీసులు పంపింది. ఇలా వివిధ రకాల అదనపు భారాలతో వెరసి తెలంగాణ డిస్కంలకు దాదాపు రూ.6వేల కోట్ల నష్టాలు వచ్చాయని తెలుస్తోంది.  ఈ అంశాలన్నీ ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ విచారణ కమిషన్ పరిశీలనలో ఉన్నాయి. ఈక్రమంలోనే ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ నుంచి కూడా వివరణ తీసుకున్నారు. మరో 24 మంది అధికారులు కూడా దీనిపై వివరణను కమిషన్‌కు అందించారు.

Also Read : Nuclear Weapons : అణ్వాయుధాల లెక్కలో పాక్‌ను దాటేసిన భారత్