Electricity Ambulances : మనకు అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే అంబులెన్సులకు కాల్ చేస్తుంటాం. ఇకపై విద్యుత్ సేవలకు అంతరాయం వాటిల్లినా.. అలాగే అంబులెన్సులకు కాల్ చేయొచ్చు. అయితేే ఇవి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే అంబులెన్సులు. హైదరాబాద్ పరిధిలో ఈ విద్యుత్ అంబులెన్సులు అందుబాటులోకి వచ్చాయి. విద్యుత్ ప్రమాదం జరిగినా, విద్యుత్ సరఫరా నిలిచిపోయినా టోల్‌ఫ్రీ నంబర్ 1912కు మనం కాల్ చేయొచ్చు. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.
Also Read :Yogi Adityanath : ‘బాబా సిద్దిఖీలాగే సీఎం యోగిని చంపేస్తాం’.. బెదిరింపు మెసేజ్ కలకలకం
తెలంగాణలోని కస్టమర్లకు మెరుగైన విద్యుత్ సేవలను(Electricity Ambulances) అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది. ఇందులో భాగంగా ‘విద్యుత్తు అంబులెన్సు’ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ మహా నగరం పరిధిలోని 57 విద్యుత్తు సబ్ డివిజన్లకు ఒక్కో వాహనాన్ని కేటాయించింది. ఇందులో ఒక అసిస్టెంట్ ఇంజినీర్, ముగ్గురు ఇతర సిబ్బందితో పాటు విద్యుత్ మరమ్మతులకు అవసరమైన అన్నిరకాల సామగ్రి ఉంటుంది. సిబ్బంది రక్షణ కోసం హెల్మెట్లు, గ్లవ్స్, సేఫ్టీబెల్ట్, షూస్, ఇతర సేఫ్టీ పరికరాలు ఉంటాయి. గతంలోనూ ఈ తరహా ఎమర్జెన్సీ సేవలను దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ అందించేది. అయితేే అప్పట్లో ఆటోలను వాడేవారు. ఇప్పుడు పెద్ద వాహనాలను అందుబాటులోకి తెచ్చారు.
విద్యుత్ అంబులెన్సులోని పరికరాలివీ..
విద్యుత్ అంబులెన్సులో థర్మోవిజన్ కెమెరాలు ఉంటాయి. వీటి సాయంతో విద్యుత్తు తీగలకు ఏర్పాటు చేసిన ఇన్సులేటర్ల ఏర్పడిన లీకేజీని గుర్తిస్తారు. మరమ్మతులు చేయాల్సిన కచ్చితమైన భాగాన్ని గుర్తించేందుకు ఇది దోహదపడుతుంది. విద్యుత్తు స్తంభానికి అనుసంధానం చేసే తీగలను క్రమపద్ధతిలో ఉంచేందుకు ఇన్సులేటర్లు దోహదపడతాయి. క్లాంపు బిగించే తీగల ద్వారా ఎర్త్ రాకుండా వీటిని బిగిస్తారు. అంబులెన్సులో ఏబీ స్వీచ్ రాడ్ ఉంటుంది. దీని సాయంతో ఏబీ స్విచ్ ఆఫ్ లేదా ఆన్ చేస్తారు. అంబులెన్సులో విద్యుత్తు రంపం ఉంటుంది. దీని ద్వారా చెట్ల కొమ్మలు, ఇతర భాగాలను కట్ చేస్తారు.కండక్టర్ జంపర్ అనే పరికరం అంబులెన్సులో ఉంటుంది. విద్యుత్ కట్ కారణంగా సరఫరా నిలిచిపోయిన ఏరియాను గుర్తించేందుకు దీన్ని వాడుతారు.