PK Report: కేసీఆర్ చేతిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల జాతకాలు.. పైనల్ రిపోర్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్!

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. వరుసగా మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టి కారు జోరు తగ్గేదే లేదు అని చాటడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

  • Written By:
  • Publish Date - June 26, 2022 / 09:00 PM IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. వరుసగా మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టి కారు జోరు తగ్గేదే లేదు అని చాటడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కానీ గులాబీ జెండా అలా రెపరెపలాడాలంటే ఇప్పుడున్న టీమ్ తో కష్టమే అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఓ రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, వారి విజయావకాశాలు, వారిపై ప్రజాభిప్రాయం, వారిపై ఉన్న ఆరోపణలు.. ఇలా వివిధ అంశాలపై రిపోర్ట్ ఇవ్వాలని పీకే ను అడిగారని.. అందుకే పీకే దానిపై సమగ్రమైన నివేదికను ఇచ్చారని సమాచారం.

రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలతోపాటు అక్కడే టీఆర్ఎస్ టిక్కెట్ ను ఆశించే ఇతర అభ్యర్థుల ప్రొఫైల్స్ కూడా గులాబీ బాస్ చెంతకు చేరాయి. వారి ఆర్థిక పరిస్థితితోపాటు రాజకీయంగా వారు చూపించగలిగే ప్రభావాన్ని కూడా ఆ నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలలో ఉన్న సానుకూల, ప్రతికూలాంశాలను కూడా వివరంగా తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై గతంలో సర్వేలు కూడా చేశారు. ఆ వివరాలను కూడా ఇందులో ఎంటర్ చేసి మొత్తంగా వడపోశారని తెలుస్తోంది.

కొందరు ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను కూడా ఈ రిపోర్ట్ లో ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యేలతోపాటు వారి కుటుంబాల దౌర్జన్యకాండ, వసూళ్లదందాపైనా వివరాలు అధినేతకు అందజేసినట్లు సమాచారం. పైగా పార్టీలో కొందరికే అందుబాటులో ఉండడం.. మిగిలినవారిని దగ్గరకు రానీయకపోవడం వంటి చర్యల వల్ల వారి విజయావకాశాలు అంతంతమాత్రమే అని రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక సెటిల్ మెంట్లు, దందాలు, బలవంతపు వసూళ్లు, కమీషన్ల పర్వాన్ని కూడా పేపర్ పై పెట్టి ఇచ్చినట్టు సమాచారం.

పీకే టీమ్ ఐప్యాక్ ఇచ్చిన ఫైనర్ రిపోర్టులో.. ఎక్కువమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గెలుపు అవకాసాలు అంతంతమాత్రమే అని రిపోర్ట్ లో తెలిపినట్లు సమాచారం. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చండి అని నేరుగా చెప్పకుండా.. అదే నియోజకవర్గంలో పార్టీలోనే మరో అభ్యర్థికి ఉన్న విజయావకాశాలను కూడా ఇచ్చిందని తెలుస్తోంది. ఇక మంత్రుల విషయానికి వస్తే మెజారిటీ మంత్రుల పనితీరు మెరుగ్గానే ఉందన్న రిపోర్ట్ ను ఇచ్చినట్టు సమాచారం. ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలనుకుంటే.. కాంగ్రెస్, బీజేపీల తరపున పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల జాబితాను, వారి ఆర్థికస్థితిని, విజయావకాశాలను కూడా ఆ రిపోర్ట్ లో అందించినట్లు తెలుస్తోంది.

ఇక నియోజకవర్గాల వారీగా ఓటర్లపై భారీగా ప్రభావం చూపించే ఐదుగురు స్ట్రాంగ్ లీడర్ల పేర్లను కూడా రిపోర్ట్ లో ఇచ్చారు. పార్టీపై ఇప్పటికే అసంతృప్తితో ఉండి.. ఇంకా గుర్తింపును ఇవ్వనప్పుడు ఎవరెవరు వెళ్లిపోవచ్చో కూడా రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే టీఆర్ఎస్ లోకి రావాలనుకుంటున్న బలమైన నేతల సమాచారం కూడా అందులో ఉన్నట్టు తెలుస్తోంది. పీకే రిపోర్ట్ ను బట్టి కేసీఆర్ ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు ఆ సమాచారం పంపించినట్టు తెలుస్తోంది. మిగిలినవారితో మాట్లాడే బాధ్యతను కేటీఆర్, హరీశ్ రావుకు అప్పగించినట్లు సమాచారం.