Elections: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలు- ఈసీ కీలక ఆదేశాలు

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది.

  • Written By:
  • Publish Date - June 3, 2023 / 01:47 PM IST

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. Election Commission of India త్వరలోనే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు జూన్ 2వ తేదీన ఆయా రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, ప్రధాన కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములయ్యే ఉద్యోగులు మూడేళ్లకు మించి ఒకేచోట పని చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాంటి అధికారులు/ఉద్యోగులను గుర్తించి బదిలీ చేయాలని పేర్కొంది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకునే అధికారులు ఎవరూ తమ సొంత జిల్లాల్లో పనిచేయకుండా చూడాలని ఆదేశించింది.వచ్చే జూలై 31వ తేదీ లోపు బదిలీల ప్రక్రియను పూర్తిచేసి నివేదిక సమర్పించాలని తెలిపింది.

పోలీస్ శాఖలోని ఎస్‌ఐలను ఎట్టిపరిస్థితుల్లో సొంత జిల్లాలో నియమించకూడదని స్పష్టం చేసింది సీఈసీ. ఇటీవల పదోన్నతి పొంది..అదే ప్రాంతంలో పనిచేస్తున్నా స్థాన చలనం కల్పించాలని పేర్కొంది. తమ బంధువులు ఎవరూ ఆ నియోజకవర్గం లేదా జిల్లా పరిధిలో ఎన్నికల్లో పోటీచేయడం లేదని అధికారులు ధ్రువపత్రాలు సమర్పించాలని సూచించింది. ఇక తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు న్యాయస్థానంలో పెండింగ్‌లో లేవని ఆయా అధికారులు నామినేషన్ల దాఖలు గడువుకు రెండు రోజుల ముందు నిర్ధారిత నమూనాలో పత్రాలు ఇవ్వాలని తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఇప్పటికే భాగస్వాములైన అధికారులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముందస్తు అనుమతి తీసుకుని, ఆ ప్రక్రియ పూర్తయిన తరవాత బదిలీ చేయాలని స్పష్టం చేసింది.

తెలంగాణలో ఓటరు నమోదు కార్యక్రమం

మరోవైపు తెలంగాణలో కొత్త ఓట‌ర్ల న‌మోదుకు ప్ర‌క్రియ ప్రారంభించింది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా 2023 అక్టోబ‌ర్ 1వ తేదీ నాటికి 18 సంవ‌త్స‌రాలు నిండిన వారు కొత్త‌గా ఓట‌రు న‌మోదు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అర్హత కలిగిన వారు బూత్‌ లెవల్‌ అధికారుల వద్ద దరఖాస్తు పూర్తి చేయాలి. జూన్‌ 24 నుంచి జులై 24 తేదీ వరకు ఓటరు కార్డులపై ఫోటోల మార్పిడి, పోలింగ్‌ కేంద్రాల బౌండరీల నిర్ధారణ చేయనున్నారు. జులై 25 నుంచి 31వ తేదీ వరకు నమూనా ఓటరు జాబితా రూపొందిస్తారు. ఆగస్టు 2వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది. ఆగస్టు 31వ తేదీ వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాపై అందిన ఫిర్యాదులను సెప్టెంబర్‌ 22వ తేదీ వరకు పరిష్కరించనున్నారు. ఓటర్ల తుది జాబితా విడుదల కోసం సెప్టెంబర్‌ 29వ తేదీ వరకు ఎలక్షన్‌ కమిషన్‌ అనుమతి తీసుకుంటారు. కమిషన్‌ అనుమతి లభించగానే అక్టోబర్‌ 4వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుద‌ల కానుంది.