EC – Bank Managers : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ జరుగుతున్న తనిఖీల్లో పెద్దఎత్తున డబ్బు, బంగారం, వస్తువులు పట్టుబడుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఎన్నికల అధికారులు బ్యాంకుల ద్వారా జరిగే అనుమానిత లావాదేవీలపై ఫోకస్ పెట్టారు. ప్రత్యేకించి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో జరిగే అనుమానిత లావాదేవీలపై నిఘా పెట్టారు. అకౌంట్లలో భారీగా జరిగే నగదు జమ, విత్‌డ్రా లావాదేవీల సమాచారాన్ని ఎన్నికల సంఘం అకౌంటింగ్ విభాగం నోడల్ ఆఫీసర్ కు రోజువారీ రిపోర్టులు వెళ్తున్నాయి. ఈమేరకు నగరంలోని బ్యాంకుల మేనేజర్లకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ (EC – Bank Managers) ఆదేశం జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
బ్యాంకు మేనేజర్లకు చేసిన సూచనలివీ..
- అనుమానిత లావాదేవీల సమాచారాన్ని ప్రతి రోజూ ఉదయం 10 గంటల్లోగా ఎన్నికల సంఘం అకౌంటింగ్ విభాగం నోడల్ ఆఫీసర్ కు పంపాలి.
- ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేయడానికి వినియోగించే వాహనాలపై నిఘా పెట్టాలి. ఆ వాహనాల మాటున డబ్బు తరలించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అనుమానిస్తోంది.
- ఏటీఎంలో డబ్బు నింపే వాహనాలకు జీపీఎస్‌ను ఏర్పాటు చేసి బ్యాంకులు ట్రాక్ చేయాలని బ్యాంకు మేనేజర్లను ఎన్నికల సంఘం కోరింది.
- బ్యాంకు అధికారులు తరలిస్తున్న నగదుకు తప్పనిసరిగా డాక్యుమెంట్లు, క్యూఆర్ కోడ్ ఉండేలా చూడాలి.
- రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి సంబంధీకుల అకౌంట్లలో రూ.లక్షకు మించిన నగదు లావాదేవీలు జరిగితే సమాచారం ఇవ్వాలని బ్యాంకు మేనేజర్లను ఎన్నికల అధికారులు కోరారు.