Harish Rao: నిధుల బకాయిలు వెంటనే చెల్లించండి

తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖ‌రిపై మంత్రి హరీష్ రావు మండి పడ్డారు. నిధుల విడుదల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదన్నారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ల‌ను విడుద‌ల చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు శనివారం మరోసారి లేఖ రాశారు.

  • Written By:
  • Publish Date - February 20, 2022 / 10:36 AM IST

తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖ‌రిపై మంత్రి హరీష్ రావు మండి పడ్డారు. నిధుల విడుదల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదన్నారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ల‌ను విడుద‌ల చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు శనివారం మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను ఈ లేఖ‌లో గుర్తు చేశారు. ఇవే అంశాలతో ఈ ఏడాది జనవరి 24న లేఖ రాశారు.
పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బ‌కాయి రూ.900 కోట్లు విడుద‌ల చేయడంతోపాటు గ్రాంట్‌ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడిగించాలని కోరారు. నీతిఆయోగ్ సూచించిన మేర‌కు రూ.24,205 కోట్లు విడుద‌ల చేయాల్సిందిగా లేఖలో కోరారు.

స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు ఇవ్వాల‌న్న 14వ ఆర్థిక సంఘం సిఫార‌సుల‌ను కేంద్రం అకారణంగా తిర‌స్క‌రించిందనీ, రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్ల‌ను తిర‌స్క‌రించడం సరికాదన్నారు. వీటిని వీలైనంత త్వరగా విడుదలయ్యేలా చూడాలని అభ్యర్థించారు.
2019-20తో పోల్చితే 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని, ఈ మేర‌కు తెలంగాణ‌కు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుద‌ల చేయాల‌ని 15వ ఆర్థిక సంఘం సూచించిన విషయాన్ని హరీష్ రావు లేఖలో గుర్తు చేశారు. ఆర్థిక సంఘం సిఫార్సుల‌ను గతంలో ఎప్పుడూ తిర‌స్క‌రించిన సంద‌ర్భాలు లేవన్న ఆయన ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ నిధుల‌ను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాలలో 2014-15 కి సంబంధించి కేంద్రం వాటాను తెలంగాణ‌కు కాకుండా పొరపాటున ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారనీ, ఈ విషయాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ, ఇంకా తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదన్నారు. దీనిని కూడా వెంటనే పరిష్కరించాలని కోరారు.