Telangana@8: బంగారు తెలంగాణ వేడుక

నీళ్లు , నిధులు, నియామకాల డిమాండ్ తో ఏర్పడిన తెలంగాణకు ఎనిమిదేళ్ల. కొంత మేరకు నీళ్లు మినహా నిధులు, నియామకాలు నినాదానికే పరిమితం అయ్యాయి.

  • Written By:
  • Updated On - June 2, 2022 / 11:16 AM IST

నీళ్లు , నిధులు, నియామకాల డిమాండ్ తో ఏర్పడిన తెలంగాణకు ఎనిమిదేళ్ల. కొంత మేరకు నీళ్లు మినహా నిధులు, నియామకాలు నినాదానికే పరిమితం అయ్యాయి. రాష్ట్రం జీతాలు ఇవ్వాలేని ఆర్థిక సంక్షోభానికి వెళ్ళింది. ఇక నియామకాలు తూతూ మంత్రమే. అయినప్పటికీ ఎనిమిదేళ్ల కాలం లో చేసిన అభివృద్ధి ఎంతో కొంత ఉంది. దాన్ని 172 పేజీలతో కేసీఆర్ సర్కార్ ప్రజలకు ఆవిర్భావ సందర్భంగా పంచి పెడుతూ సంబరాలు చేసుకుంటుంది. తెలంగాణ ప్రజల పోరాటం ఫలించిన రోజు జూన్ 2. సుమారు 58 ఏళ్లపాటు వివక్షకు గురైనట్టు భావిస్తూ సొంత రాష్ట్రం సాధించుకున్న డే. అందుకే జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తయ్యాయి. సుమారు 12 వందలమంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో 29వ రాష్ట్రంగా తెలంగాణ స్టేట్ ఏర్పడింది.

గత ఎనిమిది ఏళ్లుగా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తూ దేశానికే తలమానికంగా నిలిచినట్టు కేసీఆర్ చెబుతున్నారు. అభివృద్ధి పథంలో తెలంగాణ ముందుకెళుతోంది. ఉద్యమ నేత కేసీఆర్ సీఎంగా రెండోసారి పదవీ చేపట్టి బంగారు తెలంగాణ అంటూ రాష్ట్ర అభివృద్ధికి బాట వేశారు. తెలంగాణ రాష్ట్ర నినాదం ఎలా వచ్చింది..? ఉద్యమం ఎలా ప్రారంభమైంది? తెలంగాణ రాష్ట్రం ఎటు వైపు పయనించింది? అభివృద్ధి తీరు ఎలా ఉంది? స్వరాష్ట్ర పాలనలో విస్మరించినవి ఏంటి? ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో తెలంగాణ కలిసేందుకు ఒప్పుకోలేదు. కానీ , బలవంతంగా పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం కలిపారు. ప్రత్యేక వాదం తో 1969లో తొలిదశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. ఓయూలో విద్యార్థుల పోరాటం, మృతితో పీక్ చేరింది. తర్వాత మరుగునపడిపోయింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గొంతెత్తి నినాదించారు. ఆ సమయంలోనే 2001 ఏప్రిల్ 21వ తేదీన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవీకి రాజీనామా చేసారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2004లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. దీంతో తెలంగాణ జాతీయ ఎజెండాగా మారింది. ప్రత్యేక రాష్ట్రం కోసం 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. యావత్ తెలంగాణ సమాజం మద్దతు పలికింది. నవంబర్ 29 వ తేదీ నుంచి ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. కేసీఆర్ నిమ్స్‌లో దీక్ష కొనసాగించడం చూసి డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. దీంతో కేసీఆర్ దీక్ష విరమించారు.

తెలంగాణను సాధించిన నేత రాష్ట్రానికి సీఎం కావడంతో అన్నిరంగాల్లో తెలంగాణ దూసుకెళ్తున్నది. పాలకుల్లో సంకల్పం ఉంటే అద్భుతాలు ఎలా ఉంటాయో కాళేశ్వరం ప్రాజెక్టు పనులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ, గౌరవెల్లి, తపాస్‌పల్లి, తోటపల్లి, సింగూరు, హల్దీవాగులతో ఉమ్మడి మెదక్‌ సస్యశ్యామలంగా మారుతున్నది. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందు వరుసలో నిలిచింది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీల కల కూడా నెరవేరనున్నది. రైతులకు రాష్ట్ర సర్కార్ పెద్ద పీట వేసింది. రైతు బీమా, రైతు బంధుతో అన్నదాతలకు అండగా నిలిచింది. ఇక కేసీఆర్ కిట్లు, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు, షాదీ ముబారక్ వంటి పథకాలతో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది. ఐటీలోనూ మంచి ఫలితాలు రాబడుతూ దేశానికి దిక్సూచిలా మారింది. అటు పారిశ్రామిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

పరిశ్రమలకు రాయితీలతో పాటు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు టీఎస్ ఐపాస్ వంటి విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు దోహదపడింది. రెండేళ్లుగా కరోనా కారణంగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాఢంబ‌రంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కానీ, ఈసారి ఘనంగా నిర్వహించడానికి సిద్దం అయింది. పోటీగా కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఆవిర్భావాన్ని ఢిల్లీ కేంద్రంగా నిర్వహిస్తోంది. మొత్తం మీద ఎనిమిదేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ ఇప్పటికీ రాజకీయ అంశంగానే ఉంది. ఈ సారి గల్లీ టు ఢిల్లీ వరకు తెలంగాణ వేడుకలు అలరించనున్నాయన్నమాట.