కొండెక్కిన గుడ్డు ధర.. మధ్యాహ్న భోజనంలో గుడ్డు బంద్

కోడిగుడ్డు ధర బహిరంగ మార్కెట్‌లో రూ. 8 నుండి రూ. 10 వరకు పలుకుతుండటం ప్రభుత్వ పాఠశాలల్లో అమలువుతున్న 'పీఎం పోషణ్' (మధ్యాహ్న భోజనం) పథకంపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు కేవలం రూ. 6 మాత్రమే నిర్ణయించి చెల్లిస్తుండగా, మార్కెట్ ధరలు భారీగా పెరగడంతో వంట ఏజెన్సీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి

Published By: HashtagU Telugu Desk
Telangana Schools Eggs

Telangana Schools Eggs

 

తెలంగాణలో గత కొన్ని రోజులుగా నిత్యావసర వస్తువులతో పాటు కోడిగుడ్డు, చికెన్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ముఖ్యంగా కోడిగుడ్డు ధర బహిరంగ మార్కెట్‌లో రూ. 8 నుండి రూ. 10 వరకు పలుకుతుండటం ప్రభుత్వ పాఠశాలల్లో అమలువుతున్న ‘పీఎం పోషణ్’ (మధ్యాహ్న భోజనం) పథకంపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు కేవలం రూ. 6 మాత్రమే నిర్ణయించి చెల్లిస్తుండగా, మార్కెట్ ధరలు భారీగా పెరగడంతో వంట ఏజెన్సీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. దీనివల్ల నిబంధనల ప్రకారం వారానికి మూడుసార్లు విద్యార్థులకు అందజేయాల్సిన గుడ్ల సంఖ్యను తగ్గించడం లేదా వాటికి బదులుగా అరటిపండ్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలు చేపట్టాల్సి వస్తోంది, ఇది విద్యార్థుల పౌష్టికాహార లభ్యతపై ఆందోళన కలిగిస్తోంది.

Tg Eggs

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 24 వేల పాఠశాలల్లోని 17 లక్షల మంది విద్యార్థుల ఆకలి తీరుస్తున్న 46 వేల మంది వంట కార్మికులు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం మినహా, మిగిలిన సరుకులకు ప్రభుత్వం చెల్లిస్తున్న బడ్జెట్ (1-5 తరగతులకు రూ. 6.78, 6-10 తరగతులకు రూ. 10.17) ప్రస్తుత ధరలకు ఏమాత్రం సరిపోవడం లేదు. వంట నూనెలు, పప్పులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటడం ఒకెత్తయితే, ప్రభుత్వం నుండి రావాల్సిన బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటం వంట ఏజెన్సీలను అప్పుల ఊబిలోకి నెడుతోంది. నెలకు కేవలం రూ. 3 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న ఈ మహిళలకు, పెరిగిన ధరలు భారంగా మారి నాణ్యమైన భోజనాన్ని అందించడం సవాలుగా మారింది.

ఈ సమస్య పరిష్కారానికి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తరహాలో ప్రభుత్వమే నేరుగా పాఠశాలలకు గుడ్లను సరఫరా చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఏ విధంగానైతే పోషకాహారాన్ని నేరుగా అందిస్తోందో, పాఠశాలలకు కూడా అదే విధానాన్ని వర్తింపజేస్తే వంట కార్మికులపై భారం తగ్గుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వం పాఠశాలల్లో ‘బ్రేక్‌ఫాస్ట్’ (అల్పాహారం) పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్న తరుణంలో, మెనూ మార్పులతో పాటు వంట కార్మికులకు చెల్లించే చార్జీలను మరియు గౌరవ వేతనాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం నిరంతరాయంగా అందుతుంది.

  Last Updated: 26 Dec 2025, 12:19 PM IST