Private Market Yards : వ్యవసాయ రంగంలో మరో సంచలన సంస్కరణ చేసే దిశగా కేంద్రంలోని మోడీ సర్కారు అడుగులు వేస్తోంది. ప్రైవేటు వ్యవసాయ మార్కెట్ యార్డులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రైవేటు మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కంపెనీలు, ఎగుమతిదారులు, టోకు వర్తకులు, చిల్లర వర్తకులు నేరుగా రైతుల నుంచి వ్యవసాయ సరుకులు కొనే వెసులుబాటును కల్పించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రైవేట్ ఈ-ట్రేడింగ్ వేదికల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మోడీ ప్రభుత్వం అనుకుంటోంది. ఈ అంశాలను ‘జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా’ విధానంలో స్పష్టంగా ప్రతిపాదించారు. అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేయొచ్చని ఆ ముసాయిదాలో ప్రస్తావించారు.
Also Read :Tirupati Stampede : మృతుల వివరాలివే!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2006 సంవత్సరం నుంచే ప్రైవేటు వ్యవసాయ మార్కెట్ యార్డుల(Private Market Yards)కు అనుమతులిచ్చే విధానం అమల్లో ఉంది. అయితే ఇప్పటిదాకా ఒక్క ప్రైవేటు మార్కెట్ యార్డు కూడా ఏర్పాటు కాలేదు. ‘జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా’పై అధ్యయనానికి కమిటీ వేస్తామని తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. అన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించాకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి.
వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా అమలైతే..
కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ అదనపు కార్యదర్శి ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీ ‘జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా’ను రూపొందించింది. దేశవ్యాప్తంగా మార్కెట్ వ్యవస్థలను ఏకీకృతం చేయడం, రైతులు తమ ఉత్పత్తులకు ఉత్తమ ధరను గుర్తించి విక్రయించే వెసులుబాటు ఉండటం వంటివాటిని తమ లక్ష్యాలుగా పేర్కొంది. ‘జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా’ అమల్లోకి వస్తే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో పెను మార్పులు వస్తాయి. వీటివల్ల రైతులకు లాభం చేకూరుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే ఆ ప్రక్రియ అమల్లోకి వస్తే కానీ.. వాస్తవికత మన కళ్లెదుటకు సాక్షాత్కారం కాదు. వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా రైతుల నుంచి కొనేందుకు ప్రైవేట్ మార్కెట్లు ఏర్పాటవుతాయి. ఈ విధానంలో రైతుల నుంచి ఫుడ్ ప్రాసెసర్లు, ఎగుమతిదారులు, వ్యవస్థీకృత రిటైలర్లు పంట ఉత్పత్తులు కొంటారు. ఆన్‌లైన్ క్రయవిక్రయాల కోసం ఈ-ట్రేడింగ్ వేదికలు అందుబాటులోకి వస్తాయి. ఎలక్ట్రానిక్ కమోడిటీ ఎక్స్ఛేంజీల ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతుంది. విధాన నిర్వహణకు జీఎస్టీ మాదిరిగానే అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు.