Praja Palana Victory Celebrations : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం హన్మకొండ పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్‌ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణను వృద్ధిలోకి తీసుకొచ్చినట్లేనని అన్నారు. వరంగల్‌ను హైదరాబాద్‌కు ధీటైనా నగరంగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్ అభివృద్ధి కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిద్రపోకుండా కష్టపడుతున్నారని కొనియాడారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఎంతో పట్టుదలగా ఉన్నారని అన్నారు.
మహారాష్ట్రలో అనేక ఎయిర్‌పోర్టులు ఉన్నాయని.. కానీ తెలంగాణలో మాత్రం ఒక్కటే ఎయిర్‌పోర్టు ఉందని అన్నారు. మొత్తం తెలంగాణలో నాలుగు ఎయిర్‌పోర్టులు నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తలపెట్టగానే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు అడ్డు వచ్చినా చేపట్టిన అభివృద్ధి పనులు ఆపబోం అని సీఎం ప్రకటించారు. ఇక 2014-2018 మధ్య కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేదని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇద్దరు వరంగల్ మహిళలకు మంత్రులుగా స్థానం కల్పించామని అన్నారు. తమది మహిళల రాజ్యమని గర్వంగా చెబుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసేలా తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.
గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ కనీసం కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తిచేయలేకపోయిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణం పూర్తి చేశామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోనియమ్మ 60 సంవత్సరాల తెలంగాణ స్వప్నం నిజం చేసింది. కిషన్ రెడ్డి తనను సోనియా గులాం అని అంటుండు.. సిగ్గు లేకుండా మోడీ గులాంనని పేర్కొంటున్నావు. నీకు అధికారం ఇచ్చింది మోడీ కాదు.. సికింద్రాబాద్ ప్రజలు అని గుర్తు చేసుకో అన్నారు. మోడీ గులాం అయితే తట్టబుట్ట సదురుకోని గుజరాత్ కి పో అంటూ కిషన్ రెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: PhonePe : ఆపిల్ స్టోర్‌లో టాప్-రేటెడ్ యాప్‌గా ఫోన్‌పే