Chikoti Praveen : సినీ, రాజ‌కీయ `మ‌నీ ల్యాండ‌రింగ్‌` బండారం!

డ్ర‌గ్స్ కేసు త‌ర‌హాలోనే క్యాసినో డాన్ చికోటి ప్ర‌వీణ్ చేసిన మ‌నీ ల్యాండ‌రింగ్ వ్య‌వ‌హారంలో రాజ‌కీయ‌, సినీ వ‌ర్గాల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ఏడుపాయ‌ల వ‌ద్ద ఉన్న విలాస‌వంత‌మైన హోట‌ల్ లో జ‌రిగిన ప్ర‌వీణ్ బ‌ర్త్ డేకి వెళ్లిన సుమారు 200 మంది సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నేత‌ల ఎవ‌రు? అనే కోణం నుంచి ఈడీ ఆరా తీస్తోంది.

  • Written By:
  • Publish Date - July 30, 2022 / 02:27 PM IST

డ్ర‌గ్స్ కేసు త‌ర‌హాలోనే క్యాసినో డాన్ చికోటి ప్ర‌వీణ్ చేసిన మ‌నీ ల్యాండ‌రింగ్ వ్య‌వ‌హారంలో రాజ‌కీయ‌, సినీ వ‌ర్గాల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ఏడుపాయ‌ల వ‌ద్ద ఉన్న విలాస‌వంత‌మైన హోట‌ల్ లో జ‌రిగిన ప్ర‌వీణ్ బ‌ర్త్ డేకి వెళ్లిన సుమారు 200 మంది సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నేత‌ల ఎవ‌రు? అనే కోణం నుంచి ఈడీ ఆరా తీస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌వీణ్‌, మాధ‌వ‌రెడ్డి మొబైల్స్, కంప్యూట‌ర్స్, ఇత‌రత్రా ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. 10 మంది సెల‌బ్రిటీలు, 20 మందికిపైగా రాజ‌కీయ నాయ‌కుల‌తో సంబంధాలు ఉన్న‌ట్టు గుర్తించారు. వాళ్ల‌కు ఈడీ నోటీసులు జారీ చేయ‌డానికి సిద్ధం అవుతుంద‌ని తెలుస్తోంది.

గ‌త మూడు రోజులుగా ప్ర‌వీణ్‌, మాధవ‌రెడ్డి క్యాసినో వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు చేసిన ఈడీ మంత్రి మ‌ల్లారెడ్డి కారు స్టిక్క‌ర్ ఎపిసోడ్ ను ధ్రువీక‌రించారు. అంతేకాదు, క్యాసినో నిర్వ‌హ‌ణ కోసం సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కుల్ని ఆక‌ర్షించ‌డానికి సంప‌త్ అనే మ‌రో బ‌డాబాబు కీల‌కంగా ఉన్నాడ‌ని ఈడీ అనుమానిస్తోంది. అత‌న్ని అదుపులోకి తీసుకుని విచార‌ణ కొన‌సాగిస్తోంది. నేపాల్, థాయ్ ల్యాండ్‌, శ్రీలంక‌, గోవా త‌దిత‌ర ప్రాంతాల్లో క్యాసినోల‌ను నిర్వ‌హించడం ప్ర‌వీణ్, మాధ‌వ‌రెడ్డి దైనందిన జూదం. దానికి సెల‌బ్రిటీల‌ను, రాజ‌కీయ నేత‌ల‌ను స‌మ‌కూర్చ‌డం సంప‌త్ చేసే బ్రోక‌రిజం. ఆ ముగ్గురిని విచార‌ణ చేస్తున్న క్ర‌మంలో కొంద‌రు మంత్రులు, మాజీ మంత్రులు, 16 మంది ఎమ్మెల్యే మ‌నీ ల్యాండ‌రింగ్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని తెలుస్తోంది. అందుకే, ఈ కేసును ఈడీ సీరియ‌స్ గా తీసుకుంది.

భార‌త రూపాయ‌ల‌ను నేపాల్ రూపీ రూపంలో లావోస్ కు త‌ర‌లించార‌ని ఈడీ తెలుసుకుంది. అక్క‌డ నుంచి పెద్ద మొత్తంలో ఇండియా తిరిగి డ‌బ్బు రావ‌డాన్ని ఆర్బీఐ గ‌మ‌నించింది. వెంట‌నే ఈడీని అప్రమ‌త్తం చేయ‌డంతో బండారం బ‌య‌ట ప‌డింద‌ని తెలుస్తోంది. అంతేకాదు, గుడివాడ క్యాసినో ఆడేందుకు సంక్రాంతి సంద‌ర్భంగా కేర‌ళ రాష్ట్రానికి చెందిన పెద్ద టీమ్ వ‌చ్చింద‌ట‌. ఆ టీమ్ భారీగా న‌ష్ట‌పోవ‌డంతో వ‌న్ సైడ్ గేమ్ సంక్రాంతి సంద‌ర్భంగా ఆడిన క్యాసినోలో న‌డిచింద‌ని అనుమానించారు. ఆ మేర‌కు కేర‌ళ టీమ్ ఈడీకి ఫిర్యాదు చేసింద‌ని స‌మాచారం. మొత్తం మీద అటు ఆర్బీఐ ఇటు కేర‌ళ క్యాసినో జూద‌రుల టీమ్ ఇచ్చిన ఆధారాలను బేస్ చేసుకుని ఈడీ రంగంలోకి దిగింది. తీగ‌లాగితే డొంక క‌దిలిన చందంగా ప్ర‌ముఖ టాలీవుడ్ సెల‌బ్రిటీలు, బ‌డా రాజ‌కీయ నాయ‌కుల మ‌నీ ల్యాండ‌రింగ్ బ‌య‌ట ప‌డింది. అందుకు సంబంధించిన ఆధారాల‌ను ఈడీ సేక‌రిస్తోంది.

గోవా , నేపాల్‌లో చికోటి ప్రవీణ్ కుమార్ నిర్వహించే కాసినో ఈవెంట్‌లను ఎండార్స్ చేయడం కోసం టాలీవుడ్ , బాలీవుడ్ నటీనటులకు కోట్ల రూపాయాల లావాదేవీలు జ‌రిపిన‌ట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించింది. అక్రమ ద్రవ్య లావాదేవీలపై విచారణ కొన‌సాగుతోంది. ఈడీకి అందిన సమాచారం ప్రకారం, ప్రమోషనల్ వీడియోలలో కనిపించినందుకు కుమార్ మల్లికా షెరావత్‌కు కోటి రూపాయలు, ఈషా రెబ్బాకు రూ.40 లక్షలు, గణేష్ ఆచార్యకు రూ.20 లక్షలు, ముమైత్ ఖాన్‌కు రూ.15 లక్షలు చెల్లించారు. ఈ చెల్లింపులపై విచారణ జరుగుతోంది.

క్యాసినో ఈవెంట్‌ల సమయంలో హవాలా లావాదేవీలను ర‌హ‌స్యంగా ఉంచ‌డానికి నటుల గ్లామ‌ర్ ను ఉపయోగించుకునే అవకాశాన్ని కూడా ED పరిశీలిస్తోంది. జూన్ 10 నుండి 13 వరకు పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి జిల్లా సరిహద్దులో ఉన్న నేపాల్‌లోని ఝాపాలోని హోటల్ మెచి క్రౌన్‌లో కుమార్ , మాధవ్ రెడ్డి నిర్వహించిన కాసినో ఈవెంట్‌కు 10 మంది నటులు హాజరయ్యారు. హవాలా లావాదేవీల ద్వారా వచ్చిన డబ్బును నిందితులు భారత్‌కు తరలించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. నటీనటులతో పాటు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 16 మందికి పైగా ఎమ్మెల్యేలతో కూడా ప్ర‌వీణ్ కు సంబంధాలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సైదాబాద్‌, బోవెన్‌పల్లిలోని ప్రవీణ్‌, మాధవ రెడ్డి నివాసాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు ప్ర‌స్తుతం విచార‌ణ కొన‌సాగిస్తున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద ED అధికారులు ప్ర‌వీణ్ కుమార్ నుండి మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన నగల వ్యాపారికి లెక్కల్లో చూపని నగదును రవాణా చేసేందుకు కుమార్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నేపాల్‌లో జరిగిన ఈ ఈవెంట్ కోసం బాలీవుడ్ నటి అమీషా పటేల్ చేసిన ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, ఆమె ఈవెంట్‌లో హాజరవుతుందని మరియు అతిథులను సరదాగా గడపాలని కోరింది. కుమార్ క్యాసినో ఈవెంట్‌లకు ప్రచార కార్యక్రమాలు చేసిన ఇతర నటులు మేఘనా నాయుడు, విల్సన్ మరియు గోవింద ఉన్నారు.

ఈడీ నోటీసులపై కుమార్ స్పందిస్తూ నేపాల్ , గోవాలో క్యాసినోలు చట్టబద్ధమైనవి, ”అని చెప్పారు. తాజాగా ఏడుపాయ‌ల వ‌ద్ద జ‌రిగిన ప్ర‌వీణ్ బ‌ర్త్ డే వ్య‌వ‌హారంపై ఈడీ ఆరా తీస్తోంది. ఆ ఫంక్ష‌న్ కు సుమారు 200 మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యార‌ని తెలుస్తోంది. వాళ్ల వివ‌రాల‌ను సేక‌రించే ప‌నిలో ప్ర‌స్తుతం ఈడీ ఉంది. మాజీ మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాస రెడ్డి ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. క్యాసినో వ్య‌వ‌హారాన్ని గుడివాడ కేంద్రంగా న‌డిపినప్ప‌టి నుంచి రాద్ధాంతం జ‌రుగుతోంది. మాజీ మంత్రి బాలినేనికి స్టిక్క‌ర్ తో ఒక కారు గ‌త ఏడాది డ‌బ్బు త‌ర‌లిస్తూ దొరికింది. చెన్నైకి చెందిన న‌గ‌ల వ్యాపారి వ‌ద్ద మ‌నీ ల్యాండ‌రింగ్ కోసం ఆ డ‌బ్బును త‌ర‌లిస్తున్న‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది.

జూన్ 10వ తేదీ నుంచి 13వ తేదీ మ‌ధ్య‌న ప్ర‌త్యేక విమానాల్లో శంషాబాద్ విమానాల్లో నేపాల్ వెళ్లిన వాళ్ల జాబితా తీస్తే, మొత్తం వ్య‌వ‌హారం బ‌య‌ట ప‌డుతుంద‌ని టీడీపీ చెబుతోంది. ఏపీలోని కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు, తెలంగాణ‌లోని టీఆర్ఎస్ కు చెందిన కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు, టాలీవుడ్ ప్ర‌ముఖుల బాగోతం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని అంటోంది. వేగ‌వంతంగా ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తోన్న ఈడీ మొత్తం వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట పెడుతుందా? లేక తెలంగాణ సీఐడీ, ఏసీబీ డ్ర‌గ్స్ కేసును అట‌కెక్కించిన‌ట్టు చేస్తుందా? అనేది చూడాలి.