ED – Kavitha : పండుగ పూట కవితకు ఈడీ సమన్లు.. రేపే విచారణ

ED - Kavitha : సంక్రాంతి పండుగ పూట ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - January 15, 2024 / 07:51 PM IST

ED – Kavitha : సంక్రాంతి పండుగ పూట ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సోమవారం ఆమెకు మరోసారి సమన్లు జారీ చేసింది. విచారణకు రేపు( మంగళవారం) రావాలని కవితకు నోటీసులు ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో మరోసారి కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో.. ఏం జరగబోతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.  అయితే ఈడీ విచారణకు కవిత హాజరవుతారా లేదా అనేది వేచిచూడాలి.  లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ ఈడీ అధికారులు కవితకు సమన్లు ఇవ్వడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ పరాజయాన్ని చవిచూసింది. దీంతో ప్రతిపక్ష పాత్రకు ఆ గులాబీ పార్టీ పరిమితమైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే కేసులో గత మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. ఈడీ విచారణపై గతంలో సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఏడాది కాలంగా ఆయన జైలు జీవితాన్ని గడుపుతోన్నారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు అన్నింటినీ ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్‌ గ్రూప్‌కు సంబంధించిన వ్యవహారాలను కవిత లీడ్‌ చేశారని ఈడీ ఆరోపిస్తోంది. అంతే కాకుండా అప్రూవర్‌గా మారిన అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా చేసుకుని కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన ఇప్పటివరకు ఈడీ విచారణకు(ED – Kavitha) హాజరుకాలేదు.

Also Read: Sachin – Deepfake : సచిన్‌ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌.. ఏముందో తెలుసా?

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కవిత  గతంలో ఓ సారి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. మళ్లీ నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచే  బరిలోకి దిగేందుకు ఆమె సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల బాధ్యతనూ కవితే తీసుకున్నారు. అయితే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ మూడు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. రెండు చోట్ల బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.   అయితే హఠాత్తుగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ సమీక్షలో కవిత పోటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆమె పోటీకి వెనుకడుగు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ నుంచి  మరో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ హైకమాండ్ ఉందని చెబుతున్నారు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏదైనా ఒక లోక్‌సభ నియోజకవర్గం నుంచి కవిత  పోటీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేయకపోతే.. పార్టీ క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని పరిశీలకులు చెబుతున్నారు.