భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ ఈటెల రాజేందర్ (Eatala Rajendar), తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)పై తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా(Hydraa)పేరుతో మూడు నెలలుగా ప్రభుత్వం హంగామా చేస్తున్నదని ఆరోపించారు. బాలాజీ నగర్, జవహర్ నగర్ వంటి ప్రాంతాల్లో పేద ప్రజలు సొంతంగా భూములు కొనుగోలు చేసి 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని, ప్రస్తుతం అధికారులు ఆ ప్రాంతాల్లో కూల్చివేతల ప్రక్రియను చేపట్టడం అన్యాయమని పేర్కొన్నారు. డబ్బులు చెల్లిస్తేనే కూల్చివేతలు ఆగిపోతాయని అధికారులు ప్రజలను బెదిరిస్తున్నారని ఈటల కీలక వ్యాఖ్యలు చేసారు. ఇలాంటివి ప్రభుత్వ అవినీతి మరియు అసమర్థతకు నిదర్శనమని , అధికారుల అణచివేత చర్యల వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
Bhatti Vikramarka : పదేళ్లు బిఆర్ఎస్ చేయలేని రుణమాఫీని కాంగ్రెస్ చేసింది – భట్టి
కాంగ్రెస్ ప్రణాళికల అమలులో 7-10 శాతం కమీషన్ లావాదేవీలు జరుగుతున్నాయని ఈటెల రాజేందర్ ఆరోపించారు. ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని , బిల్లులు సెటిల్ కావడానికైనా అధికారులు కమీషన్ తీసుకుంటున్నారని, ఇది ప్రజా ధనాన్ని దోపిడీ చేయడమేనని ఆరోపించారు. ఇక పేదల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని , ప్రజల కష్టాలను తీర్చడం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కూల్చివేతలు నిలిపివేసి, ప్రజలకు సహాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయకపోతే బీజేపీ ప్రజల కోసం పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
తన రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ మరియు అవినీతిమయమైన ప్రభుత్వాన్ని చూడలేదని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య నైతికత మరియు పరిపాలనా ధర్మానికి తెలంగాణ ప్రభుత్వం విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం కాకుండా స్వలాభమే ముఖ్యమైందని ఆయన అన్నారు. ప్రభుత్వ హైడ్రా చర్యలపై ప్రజలు నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని ఈటెల పేర్కొన్నారు.