BJP RRR: కేసీఆర్ పై ‘అసెంబ్లీ’ సింహాలు!

రెండు రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే అటు రాజకీయ నాయకులతోపాటు ఇటు సామాన్య ప్రజలు సైతం ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Written By:
  • Publish Date - March 5, 2022 / 05:34 PM IST

రెండు రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే అటు రాజకీయ నాయకులతోపాటు ఇటు సామాన్య ప్రజలు సైతం ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘అంతగా ఆసక్తిగా ఎదురుచూడాల్సిన అంశం ఏముంటుంది’ అని కొంతమంది సందేహం కూడా. అయితే ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈటల రాజేందర్ ప్రత్యేకార్షణగా నిలువనున్నారు. అందుకే అందరి కళ్లు ఆయనవైపే చూస్తున్నాయి. ఒకప్పుడు అన్నదమ్ములుగా ముద్రపడిన కేసీఆర్, ఈటల ద్వయం.. రాజకీయ కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ‘ఈటల పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు’ అనే టీఆర్ఎస్ ఆరోపిస్తే.. ‘‘ఉద్యమ నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకుండా, తనపై కుట్ర పన్ని వేటు వేశారు’’ అని ఈటల ఆరోపించారు. టీఆర్ఎస్ జరిగిన పరిణామాల వల్ల ఈటల రాజేందర్ గులాబీ కండువాకు దూరం కావాల్సి వచ్చింది. పార్టీ అధిష్టానం ఆయనపై వేటు వేయడంతో ‘ఆత్మగౌరవం బావుటా’ ఎత్తుకోవాల్సి వచ్చింది. కేసీఆర్ ఢీకొట్టేందుకు బలమైన బీజేపీలో చేరి హుజురాబాద్ బరిలో నిలిచి తానేంటో నిరూపించుకున్నారు. అధికార ప్రభుత్వం ఎన్ని కుయుక్తులకు పాల్పడినా, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడినా ఈటల గెలుపును ఆపలేకపోయాయని రాజకీయ విశ్లేషకుల మాట. అందుకే ఈమారు సమావేశాల్లో ఈటల ప్రత్యేకార్షణగా నిలవనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ను ఎలా ఢీకొంటారు? ఏవిధంగా ఇరుకున పెడతారోననే విషయాలు ఆసక్తిగా మారాయి.

తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలం ముగ్గురే ఉన్నా.. ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముచ్చెమటలు పట్టిస్తామని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గతంలో ఎన్నోసార్లు అన్నారు. టీఆర్ఎస్ దుర్మార్గ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలు అయిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, గోషామహల్ నియోజకవర్గ రాజాసింగ్ తో పాటు ఈటల రాజేందర్ జతకట్టనున్నారు. ఇప్పటికే ఫైర్ బ్రాండ్ పేరున్న వీరిద్దరికి ఈటల స్వరం కూడా మరింత బలం చేకూరుస్తుంది.

18 ఏళ్లుగా తమ్ముడు, నమ్మినబంటు, గొప్ప ఉద్యమ సహచరుడిగా కీర్తించిన తనను కీర్తించిన కేసీఆర్.. రాత్రికి రాత్రే తనను దెయ్యంలా భావించి మంత్రివర్గం నుంచి వెళ్లగొట్టారని అన్నారు. ఈటల భరతం పడతానని తొడలు కొట్టిన మంత్రి హరీశ్‌రావుకు సైతం చెక్ పెట్టేలా ఈటల వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. బీజేపీలో ఆర్ఆర్ఆర్ (రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్) గా అభివర్ణించిన పార్టీ అధ్యక్షుడు బండి సైతం తన వ్యూహలు రచించారు. అసెంబ్లీలో కేసీఆర్ ను ఎలా ఎదుర్కోవాలి? ప్రభుత్వ విధానాలపై ఏవిధంగా ఎండగట్టాలి? అనే విషయమై ఇప్పటికే ఆయన కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది!