Site icon HashtagU Telugu

Eatala Rajendar: తెలంగాణపై రాజేంద్రుడు గజేంద్రుడు!

Etala

Etala

టీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగిన ఈటల రాజేందర్ కొన్ని కారణాల వల్ల పార్టీకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఆత్మగౌరవం పేరుతో ఆయన టీఆర్ఎస్ పార్టీ పదవులకు, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పి అఖండ మెజార్టీతో గెలుపొందారు. హుజురాబాద్ లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారాయన. అయితే బీజేపీలో తగిన ప్రాధాన్యం కల్పించడం లేదనే వార్తలు కూడా వచ్చాయి. ఇవన్నీ వట్టి పుకార్లేనని తేలింది. తాజాగా కేంద్రహోంమంత్రి అమిత్ షాతో ఈటల రాజేందర్ అత్యవసర భేటీ అయ్యారు. ఈ చర్చలో తెలంగాణకు సంబంధించిన అనేక విషయాలు చర్చకు వచ్చాయి.

న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడంతో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ హైకమాండ్ త్వరలో ఆయనకు కీలకమైన పదవి, బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణలో రాజకీయ పరిణామాలను షా కు ఈటల వివరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ బలాలు, బలహీనతలను తెలుసుకోవాలని కేంద్రమంత్రి ఆసక్తిగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి బీజేపీ ఎదుర్కొంటున్న సవాళ్లను అమిత్ షాకు క్షుణంగా తెలియజేశారు. హైదరాబాద్‌లో జూలై 2 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను కూడా రాజేందర్ కేంద్ర మంత్రికి తెలియజేశారు. కార్యవర్గ సమావేశంలో తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన ఎజెండాపై కూడా ఇరువురు నేతలు చర్చించారు.

ఎప్పుడైతే ఈటల టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారో.. ఆరోజు నుండే కేసీఆర్ పదునైన విమర్శలు చేయడం మొదలు పెటారు. ఈ కార్యక్రమం నిర్వహించినా ప్రభుత్వ పనితీరునే లక్ష్యంగా ఈటల విరుచుకుపడున్నారు. తెలంగాణ బీజేపీలో ఈటలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తే కచ్చితంగా బీజేపికి గెలుపు అవకాశాలు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. గతంలో ఆయన రెండుసార్లు మంత్రిగా, అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాదు.. అటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు కేటీఆర్, హరీశ్ రావులను ఎదుర్కోవడంలోనూ ఈటలను మించినవారు లేరని చెప్పక తప్పదు. మరోవైపు ఇప్పటికే సింగరేణి బెల్ట్ పై మంచి పట్టున్న కవిత వర్గానికి ఈటల చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఈటల రాజేందర్ కు కీలక పదవి ఇచ్చినా ఆశ్చర్యపోనకర్లేదు.