Eatala vs KCR: కేసీఆర్ పై ఈటల మాటల దాడిని పెంచింది ఇందుకేనా

ఎన్నిరోజులైనా ఈటల రాజేందర్ కు కేసీఆర్ పై కోపం తగ్గట్లేదని అన్పిస్తోంది.

ఎన్నిరోజులైనా ఈటల రాజేందర్ కు కేసీఆర్ పై కోపం తగ్గట్లేదని అన్పిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలదాకా కొంచెం ఆచితూచి వ్యవహరించిన ఈటల ఆ తర్వాత ఏ వేదిక దొరికినా కేసీఆర్ పై ఓపెన్ ఫైర్ చేస్తున్నారు.

తాజాగా ఒక వేదికపై మాట్లాడిన ఈటల కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చారు. కేసీఆర్ పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానని, కేసీఆర్ ఎంత గట్టిగా మాట్లాడుతాడో అంత పిరికివాడని ఈటల తెలిపారు.

హుజూరాబాద్ గెలుపును పక్కదోవ పట్టించడం కోసం కేసీఆర్ అనేక ఎత్తుగడలు వేశాడని, హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ ను కొట్టిన దెబ్బకు వచ్చి ధర్నాచౌక్ లో పడ్డాడని, అదే దెబ్బతో కేసీఆర్ భూమిమీదకు దిగివచ్చాడని, ఫామ్ హౌజ్ నుండి బయటికి వచ్చాడని ఈటల ఎద్దేవా చేశారు.
ప్రగతిభవన్ ఇనుపకంచెలు కూడా తొలగిపోవాలని, రాబోయే రోజుల్లో బీజేపీది ప్రళయం ఉంటుందని, దాన్ని కేసీఆర్ తట్టుకోలేడని ఆయన తెలిపారు.

కేసీఆర్ కాళ్ళు మొక్కితే అన్నీ తప్పులు ఒప్పు అవుతాయని ఈటల సెటైర్స్ వేశారు. ఇటు ఉన్న సూర్యుడు అటు పొడిచిన కూడా కేసీఆర్ గెలవడని ఈటల తెలిపారు. మొన్న వచ్చింది హుజూరాబాద్ తీర్పు కాదని, యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని ఆయన అన్నారు. వరిధాన్యం కొనలేక కేసీఆర్ కేంద్రం మీద నెపం వేశారని, రైస్ మిల్లులు పెట్టలేక పోయినందుకు కేసీఆర్ రెండు చెంపలు వేసుకోవాలని, బియ్యం కొనలేకపోయానని కేసీఆర్ ఒప్పుకోవాలని ఈటల డిమాండ్ చేశారు. కేసీఆర్ అబద్దాలు ప్రజలకు అర్థం అయ్యాయని,
ఇక ఆయన్ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, బీజేపీ ప్రళయం వస్తోందని దాన్ని తట్టుకోవడం కేసీఆర్ వల్ల కాదని ఈటల తెలిపారు.

బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం అయ్యాక బీజేపీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఆ చరిష్మా మెల్లిమెల్లిగా తగ్గుతొంది. బండి తర్వాత ఈటల బీజేపీ అధ్యక్షుడు అవుతారనే ప్రచారం సాగుతోంది. దానితో పాటు బీజేపీలో వర్గపోరు నడుస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వేరేపార్టీ నుండి ప్యారాచూట్ లో వచ్చిన వాళ్ళకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని క్యాడర్ నుండి విమర్శలు రావొద్దని క్యాడర్ ని ఆకట్టుకోవడానికే ఈటల మాటల తూటాలు పేల్చుతున్నారనే వాదన కూడా విన్పిస్తోంది. కేసీఆర్ పై ఘాటుగా మాట్లాడడం అయితే ఈటలకి స్వామి కార్యం, స్వకార్యంగా పనికొస్తోందని చెప్పవచ్చు.