Site icon HashtagU Telugu

Telangana Elections : ఇద్ద‌రు మిత్రుల ‘ముంద‌స్తు’ క‌థ‌

668800

668800

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు రాబోతున్నాయా? ప్ర‌త్య‌ర్థులు చెబుతున్న‌ది నిజ‌మేనా? కేసీఆర్ అడుగులు ఆ దిశ‌గా ప‌డుతున్నాయా? ఎంత వ‌ర‌కు ముంద‌స్తు మాట నిజం? ఇలాంటి అంశాల‌పై స‌ర్వ‌త్రా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఒక‌సారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసీఆర్ రికార్డ్ సృష్టించాడు. రెండోసారి అధికారంలోకి రావ‌డానికి కార‌ణం ముందుగా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డ‌మేనని 2018 ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత ప్ర‌త్య‌ర్థుల‌కు బాగా అర్థం అయింది. ఆనాడున్న ప‌రిస్థితుల్లో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం క్లిక్ కావ‌డం గ‌మ‌నార్హం.ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2018 నాటి ప‌రిస్థితులు ఉన్నాయా? అంటే లేవ‌ని చెప్పొచ్చు. ఎందుకంటే, ఆనాడు టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య ఇప్పుడున్న రాజ‌కీయ శ‌త్రుత్వం లేదు. పైగా స‌హ‌జ మిత్రునిగా ఎంఐఎం వ్య‌వ‌హ‌రించింది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు బ‌లంగా లేదు. ఇప్పుడు పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ ప‌గ్గాలు తీసుకున్న త‌రువాత గ్రౌండ్ లెవ‌ల్ లో పార్టీ బ‌లంగా ఉంద‌ని స‌ర్వేల సారాంశం. పైగా రెండోసారి కేసీఆర్ ప‌రిపాల‌న‌పై చాలా వ్య‌తిరేక‌త ఉంద‌ని పీకే స‌ర్వేల సారాంశమ‌ని తెలుస్తోంది. అందుకే, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ల స‌హాయం కేసీఆర్ తీసుకుంటున్నాడు. ఆయ‌న స‌ర్వేల ఆధారంగా మూడోసారి సీఎం కావ‌డానికి కేసీఆర్ ఎత్తుగ‌డ‌లు వేస్తున్నాడు.

తెలంగాణ అప్పులు, నిరుద్యోగభృతి, పెన్ష‌న్లు క‌త్తిరించ‌డం, జీవో 317, రైతు ఆత్మ‌హ‌త్య‌లు, క‌ల్వ‌కుంట్ల‌ కుటుంబంపై అవినీతి ఆరోప‌ణ‌లు వెర‌సి కేసీఆర్ స‌ర్కార్ పై విప‌క్షాల దుమ్మెత్తి పోస్తున్నాయి. పైగా ద‌ళిత‌బంధు హుజూరాబాద్ కేంద్రంగా విఫ‌లం అయింది. ఉద్య‌మ‌కారులు, తెలంగాణ‌వాదులు ఇప్పుడు టీఆర్ఎస్ కు చాలా వ‌ర‌కు దూరం జ‌రిగారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితాల ఆధారంగా సెటిల‌ర్లు మిన‌హా టీఆర్ఎస్ ప‌క్షాన స్థానికులు లేర‌ని స్ప‌ష్టం అవుతోంది. అందుకే, ఆయ‌న సెటిల‌ర్లు ఉన్న చోట్ల అనుకూల ఫ‌లితాల‌ను సాధించ గ‌లిగాడు. ఇటీవ‌ల అమ‌రావ‌తి ఫెయిల్యూర్, తెలంగాణ‌లో ఎక‌రం అమ్మితే ఏపీలో మూడు ఎక‌రాలు వ‌స్తుందంటూ ఏపీని కించ‌ప‌రుస్తూ చేసిన వ్యాఖ్య‌లు సెటిల‌ర్ల‌ను ఆలోచింప చేస్తోంది. ఉద్దేశ పూర్వ‌కంగా కేసీఆర్ అమరావ‌తి ప్రాజెక్టును కిల్ చేయ‌డానికి జ‌గ‌న్ కు 2019లో స‌హాయం అందించాడ‌ని సెటిల‌ర్లు విశ్వ‌సిస్తున్నారు.రాబోవు ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లోని సెటిల‌ర్లు టీఆర్ఎస్ పార్టీకి అండ‌గా ఉండే అవ‌కాశాలు త‌క్కువ‌. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ నుంచి వ‌చ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్నాడు. ఆయ‌న‌కు సెటిల‌ర్ల‌తో సాన్నిహిత్యం ఉంది. అందుకే, మ‌ల్కాజ్ గిరి లోక్ స‌భ నుంచి 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న గెల‌వ‌గ‌లిగాడు. సుమారు 50 ల‌క్ష‌ల ఓట్లు తెలంగాణ వ్యాప్తంగా సెటిల‌ర్ల‌వి ఉన్నాయ‌ని అంచ‌నా. గ్రేట‌ర్ ప‌రిధిలోని సెటిల‌ర్ల ఓటు షేర్ బాగా ఎక్కువ ఉంటుంది. దాదాపు 50 నియోజ‌క‌వ‌ర్గాల గెలుపు ఓట‌ముల‌ను నిర్ణ‌యించే స్థాయిలో సెటిల‌ర్ల ఓటు బ్యాంకు ఉంద‌ని పీకే స‌ర్వే సారాంశం. అంతేకాదు, న‌ల్గొండ‌, ఖ‌మ్మం జిల్లాల‌పై ఏపీ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ప‌రోక్షంగా ఆ రెండు జిల్లాల ఫ‌లితాల‌పై ప్ర‌భావం ఉంటుంది.

ఇలాంటి అంచ‌నాల క్ర‌మంలో స‌హ‌జ మిత్రుడిగా ఉన్న జ‌గ‌న్ ను ముంద‌స్తుకు లాగ‌డానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. షెడ్యూల్ ప్ర‌కారం 2023 డిసెంబ‌ర్ లోపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాలి. అలాగే, 2024 మే లోపుగా ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాలి. గ‌డువు కంటే ఆరు నెల‌లు ముందుగా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించే అధికారం ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఉంది. ఆ కోణం నుంచి చూస్తే జ‌గ‌న్ ను ముంద‌స్తుకు తీసుకొస్తే 2023 ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఒక‌సారి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే ఛాన్స్ ఉంది. అదే జ‌రిగితే, తెలంగాణ‌లోని సెటిల‌ర్లు ఎక్కువ మంది ఏపీలో ఓటు వేయ‌డానికి వెళ్లిపోతారు. ఫ‌లితంగా కేసీఆర్ సేఫ్ గా బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని పీకే ఇస్తోన్న స‌ల‌హా అట‌. పైగా స‌హ‌జ మిత్రునిగా ఉన్న జ‌గ‌న్ కు సెటిల‌ర్ల‌లో సామాజిక ఈక్వేష‌న్ ప్రకారం క‌లిసొచ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నార‌ట‌. అందుకే , కేసీఆర్ ముంద‌స్తుకు వెళ్ల‌కుండా జ‌గ‌న్ ను ముందుకులాగే అవ‌కాశం ఉంద‌ని ఆ రెండు పార్టీల్లో జ‌రుగుతోన్న చ‌ర్చ‌. సో..కేసీఆర్ ముంద‌స్తు ఉత్తదేన‌న్న‌మాట‌.