జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bypoll) రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికలో అక్రమ పద్ధతుల్లో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని తెలుస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో పెద్ద సంఖ్యలో డూప్లికేట్, నకిలీ ఓట్లు ఉన్నట్లు బయటకు వస్తున్నాయి. దీనిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ కేటీఆర్ (KTR) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. “రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో ఓటు చోరీ అని అంటున్నప్పుడు, ఆయన పార్టీ రాష్ట్రంలోనే దొంగ ఓట్లతో గెలవడానికి ప్రయత్నిస్తోంది” అని మండిపడ్డారు. రాష్ట్రంలోని మంత్రులంతా జూబ్లీహిల్స్‌లోకి చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ప్రజా నిధులను ఎన్నికల ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.
Nobel Prize in Economics 2025 : ఎకనామిక్ సైన్సెస్ లో ముగ్గురికి నోబెల్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 400 ఎన్నికల బూత్‌లలో కనీసం 50 దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ చేర్చిందని తెలిపారు. మొత్తం మీద దాదాపు 20,000 దొంగ లేదా డూప్లికేట్ ఓట్లు నమోదైనట్టు ఆయన ఆరోపించారు. ఒక్కొక్క వ్యక్తికి మూడు మూడు ఓటర్ ఐడీలు ఉన్నాయని, ఒకే అడ్రెస్‌తో రెండు మూడు పేర్లతో ఓట్లు నమోదు చేసిన ఉదాహరణలు వందల సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. తాము సేకరించిన వివరాలు ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ నుంచే సేకరించామన్నారు. కొన్ని చిరునామాల్లో 150-200 ఓట్లు నమోదయ్యాయి, కానీ ఆ ఇళ్ల యజమానులు తమ కుటుంబంలో ఎవ్వరూ ఆ పేర్లలో లేరని చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. చిరునామాలు లేని వ్యక్తుల పేర్లతో సుమారు 15 వేల ఓట్లు నమోదు కావడం రాష్ట్ర ఎన్నికల వ్యవస్థలో భారీ అవకతవక అని ఆయన అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై దొంగ ఓట్లు చేర్చిందనే అనుమానం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే 12 వేల డూప్లికేట్ ఓట్లను తొలగించిన తర్వాత కూడా మరో 7 వేల కొత్త పేర్లు చేర్చారని, మొత్తం 19 వేల కొత్త ఓట్లు కాంగ్రెస్ ప్రభావంతో జాబితాలో చేరాయని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని, దానికి పాల్పడిన అధికారులను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ మాటల్లో, “దొంగ ఓట్లతో గెలవాలన్న కాంగ్రెస్ పార్టీ యత్నం ప్రజాస్వామ్యానికి అవమానం. దీనిపై ఎన్నికల కమిషన్ తక్షణ చర్యలు తీసుకోవాలి” అని అన్నారు. ఈ ఎన్నిక కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గానిదే కాకుండా, తెలంగాణ ప్రజాస్వామ్య విశ్వసనీయతకు కూడా పరీక్షగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
