Site icon HashtagU Telugu

CM KCR : తెలంగాణ క్యాబినెట్ భేటీ వచ్చే వారానికి వాయిదా.. ఎందుకంటే ?

Cm Kcr Fires on Congress in Suryapet Public Meeting

Cm Kcr Fires on Congress in Suryapet Public Meeting

CM KCR : ఈరోజు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ వచ్చే శుక్రవారానికి వాయిదాపడింది.  సీఎం కేసీఆర్‌కు వైరల్ ఫీవర్ తగ్గకపోవడం వల్లే సమావేశం వాయిదా పడిందని అంటున్నారు. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం సెక్రటేరియెట్‌‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుందని సంబంధిత వర్గాలు  అనధికారికంగా చెబుతున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్‌‌‌‌తో బాధ పడుతున్నారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ పై ఎన్నికల సంఘం ప్రకటన చేసే టైం దగ్గర పడుతుండటంతో కేసీఆర్ సర్కారు నిర్వహించే చివరి క్యాబినెట్ భేటీ ఇదే అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేలా ఎలాంటి  హామీలు, తాయిలాలను ఇవ్వాలనే దానిపై కేబినెట్ మీటింగ్ లో డిస్కస్ చేస్తారని తెలుస్తోంది.

Also read : Jagan Pulivendula Politics : అరెస్ట్ ల‌తో జ‌గ‌న్ `మ‌రో ఛాన్స్` స్కెచ్

కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలకు ధీటుగా.. 

ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ధీటుగా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను రూపొందించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పింఛన్‌దారులు, రైతులు బీఆర్ఎస్ ను గెలిపించారని.. ఈసారి కూడా వారే తమ పార్టీని ఆదుకుంటారనే నమ్మకంతో కేసీఆర్‌ (CM KCR)  ఉన్నారట. అందుకే ఆసరా పింఛన్ల పెంపు, రైతు బంధు ద్వారా రైతులకు అందించే ఆర్థిక సాయం పెంపు వంటి అంశాలను బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేరుస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగుల డీఏ పెంపు, వారికి సంబంధించిన ఇతర ప్రధానాంశాలు ఎన్నికల ప్రణాళికలో ఉండబోతున్నాయని సమాచారం. 2018లో ముందస్తు ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‘నిరుద్యోగ భృతి’ని ఇస్తామంటూ ప్రకటించింది. కానీ అమలు చేయలేదు. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశముంది. దళిత బంధు, బీసీ, మైనారిటీ బంధు పథకాల తరహాలోనే మహిళా బంధు పథకానికి కేసీఆర్ రూపకల్పన చేయబోతున్నారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.