Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు రాష్ట్రవ్యాప్త “ఒకరోజు హాస్టల్ తనిఖీ” కార్యక్రమంలో భాగంగా
ఖమ్మం, మధిర, బోనకల్ లోని సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టల్స్ లో నేటి నుంచి కొత్త మెనూను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననప్పుడు 5 ఏళ్లలో ఒక్కసారి కూడా హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక 40 శాతం డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచామని.. పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలను పెంచినట్టు గుర్తు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఒకే రకమైన డైట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు బలమైన ఆహారం అందించేందుకు వైద్య నిపుణులతో డైట్ ప్లాన్ చేశాం. 40 శాతం మేర డైట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ గురుకులలాకు, హాస్టళ్లకు బిల్డింగ్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1500 చార్జీలుంటే.. సవరించి రూ.2100 చెల్లిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఇక త్వరలోనే 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. మేము మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపిస్తాం. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం పాటుపడుతున్నాం అన్నారు. ఇకపోతే..ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ హాస్టళ్లను సందర్శిస్తున్నారు. మెస్ ఛార్జీలు రిలీజ్ చేయడం, నూతన డైట్ ప్రవేశ పెట్టడంతో హాస్టళ్లన్నీ తిరుగుతూ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు.