DS Dilemma: ‘డీఎస్’ అడుగులు ఎటువైపు?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో డీఎస్ పేరు తెలియనివారు ఉండరు. ఆయన అసలు పేరు ధర్మపురి శ్రీనివాస్ అయినా డీఎస్ గానే పాపులర్. ఒకప్పుడు కాంగ్రెస్ లో వెలుగు వెలిగిన ఆయన ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.

  • Written By:
  • Publish Date - March 25, 2022 / 04:58 PM IST

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో డీఎస్ పేరు తెలియనివారు ఉండరు. ఆయన అసలు పేరు ధర్మపురి శ్రీనివాస్ అయినా డీఎస్ గానే పాపులర్. ఒకప్పుడు కాంగ్రెస్ లో వెలుగు వెలిగిన ఆయన ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అయితే టీఆర్ఎస్ లో తనకు సముచితస్థానం కల్పించలేదని కారణంతో ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో త్వరలో ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుండటంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.

డీఎస్ పెద్ద కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరనున్నారనే ప్రచారం జోరుగా నడిచింది. సంజయ్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవటంతో డీఎస్ కాంగ్రెస్ చేరటం పక్కా అని భావించారు. కానీ ఆ కథ ఇప్పటివరకు ముందుకు కదలలేదు. గతంలో ఒకసారి రేవంత్ రెడ్డి (టీపీసీసి అధ్యక్షుడు అయ్యాక) డీఎస్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించాడు కూడా. డీఎస్ కూడా సుముఖత వ్యక్తం చేశాడు. తాను కాంగ్రెస్ ను విడిచి తప్పు చేశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. డీఎస్‌ కోరికపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా సానుకూలంగా స్పందించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అతనికి వ్యతిరేక సెగ ఎదురుకావడంతో కథ అడ్డం తిరిగింది. డీఎస్‌ రాకను రాష్ట్ర పార్టీ నేతలతో పాటు నిజామాబాద్‌ జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో.. డీఎస్‌ ఎంట్రీకి కాంగ్రెస్‌ అధిష్టానం నో చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది. డీఎస్‌ను తిరిగి పార్టీలో చేర్చుకోవడం వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదన్నది రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల వాదనగా తెలుస్తోంది. డీఎస్ రీ ఎంట్రీకి పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో..  రాహుల్‌గాంధీ కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించినట్లు తెలుస్తోంది. ఒకే ఫ్యామిలీ నుంచి వేర్వేరు పార్టీల్లో ఉండడం కుదరదని, ఒకవేళ డీఎస్‌ చేరాలనుకుంటే ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్‌లో చేరితేనే స్వాగతించాలని రాహుల్‌ కూడా సూచించినట్టు సమాచారం. దాంతో కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకున్న డీఎస్‌ ఎంట్రీ ప్రయత్నాలకు ఎండ్‌ కార్డు పడినట్టు తెలుస్తోంది.

ఆ తరువాత డీఎస్ మదిలో ఏముందన్నది ఆయన అభిమానులకు, అనుచరులకు అంతుచిక్కడం లేదు. డీఎస్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు చిన్న కుమారుడు ఎంపీ అరవింద్ బీజేపీలో తక్కువ సమయంలోనే టాప్ లీడర్‌గా ఎదిగారు. పార్టీలో కీ రోల్ పోషిస్తున్నారు. బీజేపీ లో రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అరవింద్. కేంద్రం పెద్దలతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. డీఎస్ బీజేపీలోకి చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. డీఎస్ మాత్రం ఏ పార్టీ లోకి వెళతారు అన్నదానిపై క్లారిటీ ఇవ్వటం లేదు. అటు డీఎస్ పెద్ద కొడుకు సంజయ్ కూడా తండ్రి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి డీఎస్ ఏ పార్టీలో ఉంటే ఆయన వెంటే నడుస్తారు సంజయ్. అయితే డీఎస్ పొలిటికల్ అనుభవం పార్టీలకు ఎంతో కలిసొస్తుందని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ భావిస్తున్నాయి. కానీ డీఎస్ ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో అన్న దానిపై క్లారిటీ మాత్రం లేదు. డీఎస్ పొలిటికల్ ప్యూచర్ ప్లాన్ ఎలా ఉండనుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.