తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం.. ఇద్దరి ముఖ్యమంత్రుల రియాక్షన్ ఇదే..!

తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా డ్రగ్స్, గంజాయి విస్తరిస్తోంది. మారుమూల పల్లెల నుంచి పట్టణాల దాకా.. అంతటా గంజాయి దొరుకుతుండటంతో రాష్ట్రాలకు తలనొప్పిగా మారింది.

  • Written By:
  • Publish Date - October 26, 2021 / 01:16 PM IST

తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా డ్రగ్స్, గంజాయి విస్తరిస్తోంది. మారుమూల పల్లెల నుంచి పట్టణాల దాకా.. అంతటా గంజాయి దొరుకుతుండటంతో రాష్ట్రాలకు తలనొప్పిగా మారింది. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు చాలా సులభంగా దొరుకుతుండటంతో పిల్లల నుంచి పెద్దల దాకా ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. మొదట్లో సరాదాగా మొదలుపెట్టి, ఆ తర్వాత మత్తుకు వ్యసనపరులుగా మారిపోతున్నారు. పోలీసులు, ఎక్సైజ్ శాఖ ఎన్ని దాడులు చేసినా ఈ దందా గుట్టుగా సాగుతోంది. ముఖ్యంగా విద్యార్థులు విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. పోలీసుల దాడుల నేపథ్యంలో అక్రమార్కులు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని మత్తు పదార్థాలను సప్లయ్ చేస్తున్నారు. ఈ దందాలో మహిళలు, అమాయక యువకులు బలవుతున్నారు. గత నాలుగైదు రోజులుగా పోలీసుల దాడుల్లో తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మించి కేసులు నమోదువుతున్నాయి. వందలు, వేలు, టన్నుల కొద్ది గంజాయి, డ్రగ్స్ నిల్వలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తమయ్యారు. డ్రగ్స్, గంజాయికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఏ చర్యలు తీసుకుబోతున్నారంటే…

సాగుభూముల పట్టాలు రద్దు.. రైతుబంధు కట్ : సీఎం కేసీఆర్

గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా విద్యా సంస్థల వద్ద ప్రత్యేక నిఘా పెంచాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్‌ఫోర్స్ మెంట్ వింగ్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో ఫ్లయింగ్ స్క్వాడ్‌లను పటిష్టం చేయాలని సూచించారు. తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌ పాయింట్ల సంఖ్యను పెంచాలని, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. గంజాయి ఉత్పత్తిని నిర్మూలించడానికి వెంటనే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అమాయక గిరిజన యువకులు గంజాయి దందాకు బలవుతున్నారని, విద్యార్థులు, యువకులు గంజాయి తీసుకోవడం వల్ల మానసిక స్థితి మారి ఆత్మహత్యలకు దారి తీస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో గంజాయి సులభంగా దొరుకుతుందని, అధికారులు పకడ్బందీగా వ్యవహరించాలని, గంజాయి సాగు, రవాణా చేస్తున్న నేరస్థులు ఎంతటివాళ్లయినా సరే ఉపేక్షించవద్దని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. వ్యవసాయ పొల్లాల్లో గంజాయి సాగు చేస్తే.. ఆ రైతులకు సంబంధించి రైతుబీమా, రైతుబంధం పూర్తిగా నిలిపివేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. అధికారులు, టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో పనిచేసి తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం కేసీఆర్ కోరారు.

అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం జగన్ రెడ్డి

రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను సీఎం జగన్ కోరారు. కాలేజీ, వర్సిటీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండకూడదని స్పష్టంచేశారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రగ్స్ ఎక్కడినుంచి వస్తున్నాయి.. సప్లై గురించి ఆరా తీయాలన్నారు. అలాగే అక్రమ మద్యం తయారీ, ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని కోరారు. సమీక్ష సమావేశంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్, డీజీపీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయతే రాష్రంలో జనవరి 1 నుంచి అక్టోబర్ 24 వరకు 5,415 మంది స్మగ్లర్లు, చిరువ్యాపారులను అరెస్టు చేసి 270 టన్నుల గంజాయిని ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది 928 కేసులు నమోదవగా, ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య రెండింతలు ఎక్కువని పోలీసులు తెల్పడం ఆందోళన కలిగిస్తోంది.