జల వలయంలో మారుమూల గ్రామం.. బాలుడి ప్రాణాలు కాపాడిన డ్రోన్

మనుషుల అవసరాలు పెరుగుతున్నాయి.. దాంతో పాటే టెక్నాలజీ వాడకం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం డ్రోన్స్ ను అందుబాటులోకి తీసుకురావడంతో.. మారుమూల పల్లెల్లోనూ డ్రోన్స్ ప్రత్యక్షమవుతున్నాయి. భారీ వర్షానికి చిక్కుకున్న ఓ గ్రామానికి కావాల్సిన మందులను పంపి, బాలుడి ప్రాణాలను కాపాడారు.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:33 PM IST

టెక్నాలజీని మానవ అవసరాలకు వాడుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ మనిషి జీవితంలో భాగమైనవి కాబట్టే రోజువారి అవసరాలను చాలా ఈజీగా చేసుకుంటున్నాం. టెక్నాలజీ రాకతో ప్రపంచంలో జరిగే విషయాలన్నీ నిమిషాల్లో తెలుసుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్లు మనిషి జీవితంలో ఎలా భాగమయ్యాయో.. నేడు డ్రోన్స్ కూడా మనుషులతో కనెక్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు ఆడియో ఫంక్షన్లు, ఇతర శుభాకార్యాల్లో వీడియోలు, ఫొటోలకు మాత్రమే పరిమితమైన డ్రోన్స్ మనుషుల అవరసరాలకు తగ్గట్టుగా సేవలందిస్తున్నాయి.

తాజాగా కామారెడ్డి జిల్లాలో డ్రోన్ ద్వారా మందులను పంపి ఓ బాలుడి ప్రాణాలు కాపాడారు అధికారులు. గత కొన్నిరోజులుగా తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు జలవలయంలో చిక్కుకున్నాయి. జిల్లాలోని మంజీరా నదికి సమీపాన ఉన్న గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. ఇతర గ్రామాలకు రాలేని పరిస్థితి. కామారెడ్డి జిల్లాలోని కుర్తి అనే గ్రామంలో ఏడాదిన్నర వయసును బాలుడుకి తీవ్ర కడొపునొప్పి వచ్చింది. ఈ విషయాన్ని పిట్లం తహసీల్దార్ రాంమోహన్, స్థానిక పోలీసులు వైద్యాధికారులకు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం డ్రోన్ ద్వారా కావాల్సిన మందులను తరలించారు. డ్రోన్ ద్వారా సప్లయ్ అయిన మెడిసిన్ ను స్థానిక ఆశా వర్కర్లు తీసుకొని ఆ బాలుడికి అందించడంతో ప్రాణాలనుంచి బయటపడ్డాడు. ఆపదకాలంలో డ్రోన్స్ వినియోగిస్తుండటంతో పలువురు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు.

ఐటీ రంగం అనగానే.. చాలామందికి గుర్తుకువచ్చేది మొదట హైదరాబాద్. అందుకు తగ్గట్టే ఐటీరంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. డ్రోన్స్ అవసరాలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం మారుమూల గ్రామాలకు డ్రోన్స్ ద్వారా మందులను పంపిణీ చేయాలని భావించింది. మొదట వికారాబాద్ లో ప్రయోగాత్మకంగా స్టార్ చేసి సక్సెస్ అయ్యింది.