Site icon HashtagU Telugu

Harish Rao: ప్రైవేటీకరణ ‘మేకిన్ ఇండియా’ స్పూర్తికి దెబ్బ: రాజ్ నాథ్ కు హరీష్ లేఖ

Harish Rao

Harish Rao

దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ (Medak) సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయవద్దని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) కు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. డిఫెన్స్ రంగంలో ఉన్న ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుంది. దీంతో నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుంది. ఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుంది.

మెదక్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి, సిబ్బందికి గత ఆర్థిక సంవత్సరంలో కావాల్సినంత పని ఉండేది. దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సమయానికి పూర్తి చేశారు. సంస్థ సిబ్బంది ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదు. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని “సిక్ ఇండస్ట్రీ” గా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2500 మంది ఉద్యోగులు, పరోక్షంగా 5000 మంది ఉపాధి దెబ్బతింటుంది. మొత్తంగా సుమారు 25వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుంది అని (Harish Rao) లేఖలో ప్రస్తావించారు.

ఆరు డిమాండ్లు

1. మూడు రైతు చట్టాల మాదిరిగానే డిఫెన్స్ రంగా సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
2. పరిశోధనల విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి.
3. మిషనరీని ఆధునికరించాలి. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి.
4. పరిపాలన, కొనుగోలు విధానాలను సరళీకరించాలి.
5. ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలి.
6. ప్రసార భారతిలో మాదిరిగానే ఉద్యోగులకు భద్రత కల్పించాలి.

వీటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నట్టు (Harish Rao) లేఖలో పేర్కొన్నారు.

Also Read: Hyderabad Biryani: ఆన్ లైన్ డెలివరీలో హైదరాబాద్ బిర్యానీ టాప్, రంజాన్ లో 10 లక్షల డెలివరీలు

Exit mobile version