Site icon HashtagU Telugu

MLC Kavitha: 200 యూనిట్లలోపు కరెంటుకు బిల్లు కట్టకండి: ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha, chandrababu

Mlc Kavitha

MLC Kavitha: గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందని,కాబట్టి 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న విద్యుత్తుకుగానూ బిల్లులు వచ్చిన వారు బిల్లు కట్టవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అన్నారు. కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రకటనే కాబట్టి ప్రజలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నిజామాబాద్ రూరల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన పీఏసీఎస్ మాజీ చైర్మన్, మాజీ జడ్పీటీసీ అయిత ఫిలిప్ ‌- సుజ దంపతుల ఆహ్వానం మేరకు బుధవారం నాడు వారి నివాసంలో కవిత గారు క్రిస్మస్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత గారు మీడియాతో మాట్లాడుతూ….

సంక్షమ పథకాలు అందాలంటే దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, ఈ క్రమంలో రెండు మూడు అంశాలపై ప్రజలకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని, వారికి ఎటువంటి దరఖాస్తు అవసరం లేకుండా రూ. 2 వేల పెన్షన్ ను రూ. 4 వేలకు పెంచే అవకాశం ఉన్నప్పటికీ పెంచకుండా మళ్లీ దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ గ్రామాల్లో ప్రజలు లైన్లు కట్టే పరిస్థితి ఎందుకు తీసుకోస్తున్నారని అడిగారు. మళ్లీ దరఖాస్తులు కోరడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. పెన్షన్ అందుకుంటున్న 44 లక్షల మందికి జనవరి 1 నుంచి రూ. 4 వేలకు పెంచి పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత పథకాలను వర్తింపజేస్తే అందరికి పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని అన్నారు. కాబట్టి రేషన్ కార్డులకు దరఖాస్తులను త్వరగా స్వీకరించి కార్డులు జారీ చేసి పథకాలు ఇస్తే బాగుంటుందని చెప్పారు. రేషన్ కార్డులు తక్షణమే ఎందుకు జారీ చేయడం లేదన్న ప్రశ్న ప్రజల నుంచి ప్రస్తోందని అన్నారు.

రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో ఇంకా ఎందుకు జమా చేయలేదన్న చర్చ గ్రామాల్లో జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సూచించారు. రూ. 4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, దానికి ఎందుకు దరఖాస్తులు స్వీకరించడం లేదన్న చర్చ కూడా జరుగుతోందన్నారు. కాగా, ఓట్ల శాతంలో బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా లేదని, కేవలం 2 శాతం ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

Exit mobile version