Site icon HashtagU Telugu

Minister Indrakaran: అటవీ అమర వీరుల త్యాగాలను మరువొద్దు: మంత్రి ఇంద్రకరణ్

Indrakaran Reddy

Indrakaran Reddy

హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 11: అటవీ అమర వీరుల త్యాగాలను ఉద్యోగులెవరూ మరువొద్దని  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కోరారు. సోమ‌వారం జాతీయ‌ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్స‌వం సందర్భంగా నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్  స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళుల‌ర్పించారు.  అనంత‌రం మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. అట‌వీ సంప‌ద‌ను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాల‌ర్పించి వీర‌మ‌ర‌ణం పొందిన అట‌వీ సిబ్బంది త్యాగాలు వృధా కానివ్వ‌కుండా, వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో అట‌వీ సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. విధి నిర్వ‌హ‌ణ‌లో 1984వ సంవత్సరం నుండి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 22 మంది తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోవ‌డం చాలా భాద‌క‌రమ‌న్నారు.

విధి నిర్వహణలో అశువులు బాసిన కుటుంబాలకు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుందని తెలిపారు.  అదేవిధంగా అట‌వీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్ర‌భుత్వం అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుందని చెప్పారు. అట‌వీ సంప‌ద‌ను ర‌క్షించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అట‌వీ శాఖ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని అభినందించారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భద్రాది – కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు గ‌తేడాది న‌వంబ‌ర్ 22న‌ గుత్తికోయ‌ల చేతిలో ప్రాణాలు కొల్పోయారని, అడ‌వుల సంరక్ష‌ణ కోసం ఆయ‌న  చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు.

శ్రీనివాస రావు కుటుంబానికి  రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా నిల‌బ‌డిందని, సీయం కేసీఆర్ గారు మాన‌వ‌త దృక్ప‌థంతో శ్రీనివాస రావు స‌తీమ‌ణి నాల‌గ‌క్ష్మికి డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఉద్యోగం క‌ల్పించారని తెలిపారు.  అంతేకాకుండా రూ. 50 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియాతో పాటు ఖ‌మ్మం జిల్లాలో 500 గ‌జాల ఇంటి స్థ‌లాన్ని ప్ర‌భుత్వం కేటాయించిన‌ట్లు తెలిపారు. అమ‌రుల త్యాగాల‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రకృతి ప్రసాదించిన‌ వన సంపదను రేపటి మన భవిష్యత్తు, భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అట‌వీ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినం సంద‌ర్భంగా అటవీ అమరవీరుల త్యాగాల‌ను స్మరించుకోవడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.

అట‌వీ శాఖ ఆద్వ‌ర్యంలో చేప‌ట్టిన ప‌లు కార్య‌క్రమాలు

2022- 2023వ‌ సంవత్సరంలో అటవీ రక్షణలో భాగంగా అటవీ అధికారులు 79,735  కేసులను నమోదు చేసి,  రూ.43.56 కోట్ల జరిమానాను విధించారు. రూ. 7.31 కోట్ల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు.  15,122 వాహనాలను జప్తు చేశారు. 12,019 అటవీ భూ ఆక్రమణ కేసులు నమోదు చేశారు.

అంతేకాకుండా అట‌వీ ప్రాంతంలో  చెట్ల‌ను న‌రికిన అగంత‌కుల‌పై 26,408 కేసులు న‌మోదు చేసి
రూ. 57.81 కోట్ల విలువ చేసే క‌ల‌ప‌ను స్వాదీనం చేసుకున్నారు.

ఇక అటవీ శాఖను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగుల‌ను, సిబ్బంది నియామ‌కాల‌ను ఎప్ప‌టికప్పుడు భ‌ర్తీ చేస్తోంది.  గ‌తేడాది 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్ల (FBO’s), 14 ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్లు (FRO’s)  ఉద్యోగాల నియామకాల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది. భ‌ర్తీ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

అదేవిధంగా  అటవీ అధికారులు, సిబ్బందికి 2,181 వాహనాలను స‌మ‌కూర్చింది. జంగిల్ బచావో – జంగిల్ బడావో నినాదం ద్వారా ఇప్పటికే ఉన్న అడవుల రక్షణతో పాటు క్షీణించిన అడవుల పునరుజ్జీవనం కొరకు ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో పెద్ధ ఎత్తున చర్యలు తీసుకొంటున్నాము.

శాఖాహార జంతువుల‌ కోసం 1806.11 హెక్టార్ల విస్తీర్ణంలో స‌హ‌జ‌ గ‌డ్డి క్షేత్రాల‌ను అభివృద్ధి చేయ‌డం, వ‌న్య‌ప్రాణుల దాహార్తిని  తీర్చేందుకు సోలార్ పంప్ సెట్లు, సాస‌ర్ పిట్స్ ఏర్పాటు చేయ‌డం, అడవి సరిహద్దులు సరి చూసుకొని పెంపుడు జంతువులు, పశువులను నియంత్రించేందుకు  10,732  కి.మీ పొడవున కందకాల ఏర్పాటులో అట‌వీ శాఖ ఉద్యోగులు, సిబ్బంది కృషి అభినంద‌నీయం.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “తెలంగాణకు హరితహార కార్య‌క్ర‌మం” ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 290 కోట్లకు పైగా మొక్కలను నాటాం. మీరు చేసిన‌ కృషి వ‌ల్ల  పచ్చదనం పెంపులో అనేక జాతీయ‌, అంత‌ర్జాతీయ అవార్డులు మ‌న రాష్ట్రం సొంతం చేసుకుంది.

వీటితో పాటు  ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాట తప్పకుండా…..  ఏళ్ల తరబడి అడవినే నమ్ముకున్న ఆదివాసీ, గిరిజన బిడ్డలకు భూమి హ‌క్కు క‌ల్పిస్తూ పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష యాబై వేల గిరిజన కుటుంబాలకు 4.06 ల‌క్ష‌ల‌ ఎకరాల పోడు భూములకు పట్టాలు అంద‌జేస్తున్నాం. పట్టాలతోనే సరిపెట్టకుండా రైతుబంధు, రైతుబీమా పథకాలనూ అమలు చేస్తున్నాం.