Minister Seethakka: పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దానసరి అనసూయ సీతక్క (Minister Seethakka) ఆదివారం మధ్యాహ్నం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ENC ఎన్. అశోక్‌తో పాటు చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వర్షాలు, వరదల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడిన పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తూ ఇప్పటివరకు మొత్తం 86.55 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయని మంత్రికి నివేదించారు.
ఈ రహదారుల తాత్కాలిక పునరుద్ధరణకు ఆరున్నర కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.143 కోట్ల వరకు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. మొత్తంగా రహదారులు మరియు ఇతర మౌలిక వసతుల పునరుద్ధరణకు రూ.150 కోట్ల వరకు అవసరమవుతుందని అధికారుల నివేదిక వెల్లడించింది. అలాగే వర్షాలు, వరదల కారణంగా 66 రహదారులు, 83 క్రాస్ డ్రైన్ పనులు, 60 చోట్ల గండ్లు పడినట్లు వివరించారు. అంతేకాకుండా శిధిలావస్థలో ఉన్న 36 భవనాలు గుర్తించామని, వాటిలో నివసిస్తున్న ప్రజలను ఇతర సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నామని మంత్రికి తెలియజేశారు.
Also Read: BRS MLC Father: పేకాట ఆడుతూ పట్టుబడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తండ్రి!
గత రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా రవాణా సంబంధాలు తెగిపోయిన కొన్ని గ్రామాలకు మళ్లీ కనెక్టివిటీ పునరుద్ధరించినట్లు ఈఎన్‌సీ అశోక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా భీమిలి మండలంలోని కర్జిభీంపూర్ గ్రామానికి, అదే మండలంలోని రాజారం గ్రామానికి రవాణా సంబంధాలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. అసిఫాబాద్ జిల్లా, అసిఫాబాద్ మండలంలోని రాజూర్ గ్రామానికి కూడా కనెక్టివిటీ పునరుద్ధరించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్నవారు పనిప్రదేశాలను వదిలి వెళ్లరాదని సూచించారు. వర్షాలు తగ్గిన వెంటనే తాత్కాలిక మరమ్మతు పనులను తక్షణం పూర్తి చేయాలని ఆదేశిస్తూ, జిల్లా కలెక్టర్ల వద్ద ఇప్పటికే తగిన నిధులు అందుబాటులో ఉన్నందున వాటిని వినియోగించి తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సమాజానికి నేరుగా సంబంధించిన రహదారులు, కల్వర్టులు, భవనాల పునరుద్ధరణలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వేగంగా స్పందించాలని మంత్రి సీతక్క ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.